
ఎన్ 440 కే వైరస్ తీవ్రత లేకపోతే పొరుగు రాష్ట్రాల ఆంక్షలెందుకు ? అచ్చెన్న ప్రశ్న
ఈ వ్యవహారంపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ 440 కే వైరస్ తీవ్రత లేకపోతే పొరుగు రాష్ట్రాలు నేటి నుంచి వచ్చే వారిపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నాయని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చేవారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఢిల్లీతో సహా వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రజల ప్రాణాల కంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

రాష్ట్రంలో కరోనా తీవ్రతపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అచ్చెన్న ఫైర్
రాష్ట్రంలో కరోనా తీవ్రతపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా అంటూ ప్రశ్నించిన అచ్చెన్నాయుడు ఇకనైనా ప్రభుత్వ వైఖరి మారాలని హితవు పలికారు. ఇకనైనా తప్పిదాలు కప్పిపెట్టకుండా ప్రతిపక్షాలు, శాస్త్రవేత్తలు, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని ప్రభుత్వానికి సూచించారు.18 నుండి 45 ఏళ్ల వరకు వ్యాక్సిన్ ఇవ్వాలనే కేంద్రం మార్గదర్శకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు కరోనా నియంత్రణపై వాస్తవాలను దాచిపెట్టి, అంతా సవ్యంగా జరుగుతుందని చెబుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఆక్సిజన్ లేక ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితి ఏపీలో ఉండటం జగన్ చేతగానితనం : మంతెన
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడిలో జగన్ సర్కార్ విఫలమైందని వైసీపీ నేతలు వాస్తవాల్ని దాచిపెట్టి , దేశంలోనే ఏపీ కరోనా కట్టడిలో మొదటి స్థానం అంటూ డబ్బా కొట్టుకోవడం సిగ్గుమాలిన చర్య అని టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. ప్రజలు ఆక్సిజన్ లేక ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితి ఏపీలో ఉండటం జగన్ చేతగానితనం వల్లనేనంటూ నిప్పులు చెరిగారు.అంతేకాదు ప్రజల ప్రాణాలను పట్టించుకోని జగన్ రెడ్డి కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు మేలు చేసే పనిలో బిజీగా ఉన్నారని విమర్శించారు.

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మంతెన డిమాండ్
ఇక రాష్ట్రంలో వైద్యం సరిగా అందడం లేదని, పక్క రాష్ట్రాలకు బాధితులు తరలి పోతుంటే ప్రైవేట్ ఆసుపత్రులు ఏపీ ప్రజలను దోపిడీ చేస్తున్నాయని, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఏపీ సర్కార్ కు పట్టడంలేదని విమర్శించారు రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఈ పరిణామాల దృష్ట్యా వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మంతెన సత్యనారాయణ రాజు డిమాండ్ చేశారు.