
15 రోజుల్లో 40 మందికి…
గత 15 రోజుల్లో సూరత్‌లో 40 మ్యుకోర్‌మైకోసిస్(బ్లాక్ ఫంగస్) కేసులు నమోదయ్యాయి. ఇందులో 8 మంది కంటి చూపు కోల్పోయారు. వీరంతా కొద్దిరోజుల క్రితమే కోవిడ్ నుంచి కోలుకున్నవారు కావడం గమనార్హం. కోవిడ్ నుంచి కోలుకున్న కొద్దిరోజులకే ఈ కొత్త లక్షణాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కారణంగా సోకిన మ్యుకోర్‌మైకోసిస్‌కు చికిత్స ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే చికిత్సను వాయిదా వేసినా… అసలు చికిత్స తీసుకోకపోయినా దానివల్ల శాశ్వతంగా కంటిచూపును కోల్పోతారని చెబుతున్నారు. అంతేకాదు,కొన్ని సందర్భాల్లో అది మరణానికి కూడా దారితీస్తుందని అంటున్నారు.

సైనస్ లేదా ఊపిరితిత్తులపై ప్రభావం…
అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ప్రకారం… మ్యుకోర్‌మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనేది అరుదైన ఇన్ఫెక్షన్. మ్యుకోర్‌మైసిట్స్ అనే ఫంగస్ వల్ల ఇది సోకుతుంది. సాధారణంగా ఇది వాతావరణంలో అన్నిచోట్లా వ్యాపించి ఉంటుంది. ఎప్పుడైతే గాలి ద్వారా ఇది శరీరంలోకి వెళ్తుందో సైనస్ ఇన్ఫెక్షన్ సోకడం లేదా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. చర్మంపై మంట రావడం,చర్మం చిట్లిపోవడం వంటి లక్షణాలు కూడా కనబడవచ్చు.

కోవిడ్ నుంచి కోలుకున్న 3 రోజులకు…
సూరత్‌లోని కిరణ్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డా.సంకేత్ షా తెలిపిన వివరాల ప్రకారం… కోవిడ్ నుంచి కోలుకున్న 3 రోజుల తర్వాత మ్యుకోర్‌మైకోసిస్ లక్షణాలు బయటపడవచ్చు. మొదట సైనస్‌లో సోకే ఫంగస్ ఆ తర్వాత కంటికి చేరవచ్చు. అక్కడినుంచి ఆ ఫంగస్ మెదడు వైపు వెళ్లి అక్కడ కూడా ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఫంగస్ ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉంది. డయాబెటీస్,ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు.

ఇవే లక్షణాలు…
తలనొప్పి,కళ్లు ఎర్రబడటం.. మ్యుకోర్‌మైకోసిస్ ఇన్ఫెక్షన్ సోకినవారిలో కనిపించే సాధారణ లక్షణాలు. మ్యుకోర్‌మైకోసిస్ ఒకవేళ సైనస్ లేదా మెదడు భాగంలో సోకితే… ముఖం ఒకవైపు వాపు రావడం,నాసిక రంధ్రాలు మ్యూకస్‌తో నిండిపోవడం,ముక్కులో లేదా నోటి లోపలి పైభాగంలో పుండు కావడం తద్వారా తీవ్ర జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ మ్యుకోర్‌మైకోసిస్ ఊపిరితిత్తులకు సోకితే… జ్వరం,దగ్గు,ఛాతి నొప్పి,శ్వాస సమస్యలు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారిలో కొన్నిచోట్ల చర్మం నల్లగా మారవచ్చు.