Andhra Pradesh
oi-Dr Veena Srinivas
సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై టిడిపి నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో పాటుగా, సంగం డెయిరీ ఎండి గోపాలకృష్ణ, సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంగం డెయిరీ కేసులో అరెస్ట్ అయ్యి,రాజమండ్రి జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న దూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
సంగం డెయిరీ కేసు: ఏసీబీ కస్టడీలో ధూళిపాళ్ళ , ఏసీబీ ఆఫీస్ వద్ద కంటతడి పెట్టిన నరేంద్ర కుటుంబం
ధూళిపాళ్ళ నరేంద్రతో పాటు సంగం డెయిరీ కేసు నిందితులకు కరోనా పాజిటివ్
తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర తోపాటు ఈ కేసులో అరెస్ట్ చేసిన సహకార శాఖ మాజీ అధికారి గురునాధానికి సైతం కోవిడ్ పాజిటివ్ గా తేలింది. నిందితుడిగా ఉన్న ఎండి గోపాలకృష్ణ సైతం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో, ప్రస్తుతం ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న టిడిపి సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న కారణంగా ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కోర్టును ఆశ్రయించారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో టెస్టులు చేయించి చికిత్స అందించాలన్న కోర్టు
నరేంద్ర ఆరోగ్యపరిస్థితిపై వేసిన పిటిషన్ ను స్వీకరించి విచారించిన ధర్మాసనం ఆయనకు ప్రైవేటు ఆస్పత్రిలో టెస్టులు చేయించి,చికిత్స అందించాలని పోలీసులను, జైలు అధికారులను ఆదేశించింది.అంతేకాదు కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.ఇదే సమయంలో పిటిషనర్ల బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరపడానికి హైకోర్టులో ఉన్న పిటిషన్ అడ్డంకి కాదని తెలిపింది హైకోర్టు.ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ధూళిపాళ్ళ విజయవాడ ఆయుష్ కు తరలింపు , ఆస్పత్రిలో చికిత్స
ధూళిపాళ్ల నరేంద్రకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ధూళిపాళ్ళ నరేంద్ర, గురునాథం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఇద్దరిని విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన దూళిపాళ్ల నరేంద్రకు వైద్యులు చికిత్సను కొనసాగిస్తున్నారు. కానీ ధూళిపాళ్ల ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇటీవల ధూళిపాళ్ళ నరేంద్రను ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు.