Andhra Pradesh
oi-Srinivas Mittapalli
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ కార్యక్రమాలు పెరిగిపోయాయి.ప్రభుత్వ సమీక్షా సమావేశాలు,పెళ్లిళ్లు ఆఖరికి కర్మ కాండలు కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన ఓ బాధితురాలికి ఆమె కుమారులు ఆన్‌లైన్‌లో కర్మకాండలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళ్తే… భీమవరానికి చెందిన పద్మావతి అనే మహిళ 11 రోజుల క్రితం కరోనాతో మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు బెంగళూరులో స్థిరపడగా… మరో కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భీమవరం వెళ్లి తల్లికి కర్మకాండలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ ఇద్దరు కుమారులు ఒక నిర్ణయానికి వచ్చారు.

భీమవరంలో తమకు తెలిసిన పురోహితుడిని ఫోన్ ద్వారా సంప్రదించి తమ తల్లికి కర్మకాండలు నిర్వహించాల్సిందిగా కోరారు. ఆన్‌లైన్ ద్వారా కుమారులు ఇద్దరు ఈ కర్మకాండ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాయ్ సహకారంతో ఇలా ఆన్‌లైన్‌లో కర్మకాండలు నిర్వహించారు. దీనిపై పురోహితుడు మాట్లాడుతూ…పద్మావతి కుమారులు ఆమె కర్మకాండలు ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు తనను సంప్రదించినట్లు చెప్పారు. వృత్తి రీత్యా వేరే ప్రాంతాల్లో ఉండటం… కరోనా నేపథ్యంలో ఏపీకి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఆన్‌లైన్ ద్వారానే ఇద్దరు కుమారులు కర్మ కాండల్లో పాల్గొన్నట్లు చెప్పారు. భక్తి శ్రద్ధలతో సశాస్త్రీయంగా కర్మకాండ క్రతువు నిర్వహించామని… గోదానం,దశదానాలు చేశామని చెప్పారు.
ఆన్‌లైన్ ద్వారానే ఆ ఇద్దరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ… దగ్గరుండి ఈ క్రతువును జరిపించినట్లుగా అంతా జరిగిందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలోని మెదక్ జిల్లాలో కరోనా కారణంగా ఓ పెళ్లి ఆన్‌లైన్‌లో జరగడం విశేషం. పెళ్లికి కొద్ది గంటల ముందు పక్క వీధిలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోవడంతో పురోహితుడు ఆ కార్యక్రమానికి వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆన్‌లైన్‌లోనే పురోహితులు పెళ్లి మంత్రాలు చదవగా అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టేశాడు. దీంతో అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిగింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్లా తాండాలో ఈ ఘటన జరిగింది.