84 ఏళ్లు..కొడుకు విముక్తి కోసం అవిశ్రాంత పోరాటం..జైల్లో తనయుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తల్లి గాథ.

National

oi-Srinivas Mittapalli

|

ఆ తల్లి వయసు 84 ఏళ్లు… సాధారణంగా ఆ వయసులో ఏ తల్లి అయినా మనవలు,మనవరాళ్లతో గడుపుతూ కాలం వెళ్లదీస్తారు… కానీ ఆ తల్లి అందరు తల్లుల్లా భద్రజీవి కాదు.. జైలు గోడల నడుమ చిక్కుకుపోయిన తన కొడుకు విముక్తి కోసం ఆమె అహర్నిశలు శ్రమించారు… వేల మైళ్ల దూరం వెళ్లి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు… కొడుకు జైల్లో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే… అతని తరుపున ఆమే ఒక సైన్యమై ప్రచారం నిర్వహించారు… జైల్లో నుంచే ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించిన ఆ కొడుకు విజయం వెనుక ఆ తల్లి చేసిన కృషి మాటలకు అందనిది…

ఎవరా తల్లి…

ఆ తల్లి పేరు ప్రియాడ గొగొయ్. ఇటీవల అసోం అసెంబ్లీ ఎన్నికల్లో శివసాగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అఖిల్ గొగొయ్‌(47)కి తల్లి. దేశద్రోహం ఆరోపణలతో 2019 డిసెంబర్‌లో అరెస్టయిన అఖిల్‌ గొగోయ్‌ అప్పటి నుంచి జైల్లో ఉంటున్నారు. అఖిల్ గొగొయ్ అసోంలో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ఉద్యమించాడు. సమాచార హక్కు చట్టం కార్యకర్త కూడా ఉన్నాడు. రాయ్‌జోర్ దళ్ అనే కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందాడు.

అన్నీ తానై జనంలోకి…

84 ఏళ్ల ప్రియాడ గొగొయ్‌కి కంటిచూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. అయితే ఆమె ఆత్మస్థైర్యం గొప్పది. అనారోగ్య సమస్యలున్నా… ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆమె కొడుకు కోసం నిలబడ్డారు. జైల్లో నుంచి కొడుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే… అతని తరుపున అన్నీ తానై జనంలోకి వెళ్లారు. ఏడాది కాలంగా #FreeAkhilGogoi క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్న ఆ తల్లి… ప్రజాక్షేత్రంలో గెలుపే తన కొడుకుని విముక్తి చేస్తుందని బలంగా విశ్వసించారు.

అండగా మరికొందరు ఉద్యమకారులు

అఖిల్ గొగొయ్ స్థాపించిన రాయ్‌జోర్‌ దళ్‌ పార్టీ సభ్యులతో కలిసి ఎన్నికల్లో నియోజకవర్గమంతా కలియదిరిగారు. ప్రతీ మూలకు వెళ్లి తన కొడుకును గెలిపించాలని కోరారు. మేదా పాట్కర్,సందీప్ పాండే లాంటి సామాజిక ఉద్యమకారులు కూడా ఆమెకు అండగా నిలబడ్డారు. ఎన్నికల సందర్భంలో ఒకచోట ప్రియాడ గొగొయ్ మాట్లాడుతూ… ‘నేను నా కొడుకు కోసం ప్రచారం చేస్తున్నాను. నా కొడుకు జైలు నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నాను. ప్రజలు మాత్రమే నా కొడుకుని విడిపించగలరని తెలుసు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా నిర్బంధం నుంచి అతను బయటకొస్తాడు…’ అని చెప్పుకొచ్చారు.

ఆ తల్లి పోరాటం స్పూర్తిదాయకం…

జైల్లో ఉన్నప్పటికీ అఖిల్ గొగొయ్… అక్కడినుంచే ప్రజలకు ఎన్నో బహిరంగ లేఖలు రాశారు. ప్రజా సమస్యలను లేవనెత్తుతూ… వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. అప్పటికే సీఏఏ ఉద్యమంతో రాష్ట్ర ప్రజలందరికీ చేరువైన అఖిల్‌ను… 84 ఏళ్ల అతని తల్లి తనదైన ప్రచారం ద్వారా మరింతగా జనంలోకి తీసుకెళ్లారు. అందరూ ‘అమ్మా..’ అని ఆప్యాయంగా పిలిచే ఆ తల్లి… అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు గెలుపొందడంతో కాస్త కుదుటపడ్డారు. ఇంత వృద్దాప్యంలోనూ ఆమె చేసిన పోరాటం చాలామందికి స్పూర్తిదాయకం అనడంలో సందేహం లేదు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *