National
oi-Dr Veena Srinivas
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.కరోనావైరస్ కేసుల రికార్డు స్థాయిలో పెరుగుదల దృష్ట్యా ఢిల్లీ సర్కార్ కరోనా కట్టడికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమల్లో ఉన్న లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగలేదు. నానాటికీ పెరుగుతున్న కేసులు, మరణాలతో ఢిల్లీలో పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం కరోనా ఉధృతి దృష్ట్యా ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.
ఢిల్లీలో కరోనా విజృంభించడంతో ఏప్రిల్ 19వ తేదీన రాత్రి 10 గంటల నుండి ఏప్రిల్ 26 వరకు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేజ్రీవాల్, కేసులలో ఎలాంటి తగ్గుదల లేకపోవడంతో మే మూడవ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఇక లాక్ డౌన్ సోమవారం ఉదయం 5 గంటలకు పూర్తి కానున్న నేపథ్యంలో మరోమారు లాక్ డౌన్ వారం రోజుల పాటు పొడిగిస్తూ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన, కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇది దేశ రాజధానిలో లాక్ డౌన్ రెండో సారి పొడిగింపు. గత ఆదివారం, మొదటిసారి లాక్ డౌన్ పొడిగింపు ప్రకటించినప్పుడు, ముఖ్యమంత్రి ఇలా అన్నారు. కరోనావైరస్ ఇప్పటికీ నగరంలో వినాశనం చేస్తూనే ఉంది. ప్రజల అభిప్రాయం ప్రకారం లాక్ డౌన్ పెరగాలి. కనుక ఇది ఒక వారం పాటు పొడిగించబడుతోంది అని ట్వీట్ చేశారు.ఇప్పుడు మరోమారు లాక్ డౌన్ ఇంకో వారం పాటు పొడిగించారు.