14 రోజులపాటు నిషేధం.. ఐదేళ్ల జైలు, భారీ జరిమానా
భారతదేశంలో 14 రోజులపాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగుపెడితే ఐదేళ్లపాటు జైలుశిక్ష లేదా 66వేల డాలర్లు(సుమారు రూ. 49 లక్షలు) జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ నిబంధనలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం బయో సెక్యూరిటీ చట్టం కింద ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
భారత్‌లో 9వేల మంది ఆస్ట్రేలియాన్లు.. 600 మందికి కరోనా?
భారతదేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా, భారతదేశంలో సుమారు 9000 మంది ఆస్ట్రేలియన్లు నివసిస్తున్నారని, వాళ్ళలో దాదాపు 600 మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా అంచనా వేసింది.
ఐపీఎల్ ఆస్ట్రేలియా ఆటగాళ్ల పరిస్థితి..?
అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లు, శిక్షణా సిబ్బందికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిబంధన నుంచి సడలింపు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏప్రిల్ 27 నుంచి మే 15 వరకు భారత్ నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిషేధించిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
ఆస్ట్రేలియాలో అక్కడి ప్రభుత్వం కఠినంగా నిబంధనలను అమలు చేసి కరోనా మహమ్మారిని కట్టడి చేసింది. ప్రస్తుతం రోజుకు అక్కడి రెండంకెల సంఖ్యలో మాత్రమే కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 29,779 కేసులు నమోదు కాగా, 910 మరణాలు సంభవించాయి. ఇక మనదేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 4,01,993 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకరోజులో 4 లక్షల కేసులు నమోదుకాకపోవడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.91కోట్లకు చేరింది. కొత్తగా 3523 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 2,11,853కు చేరింది.