ఇరవై మూడేళ్ల రానో సింగ్ కి ప్రసూతి నొప్పులు మొదలయ్యాయి. ఆమె అత్తగారు, భర్త  కొండ పక్కన ఉన్న తమ ఇంటిలో నుంచి కంగారుగా బయటకి వచ్చారు. అప్పుడే ఉదయం 5 గంటలు అవుతూ ఉంది. వాళ్ళ ఇంటి ముందు నుండి  ఒక కిలోమీటరున్నర దాకా కొండ పైకి దారి ఉంది. అది మెయిన్ రోడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళకొక ప్రైవేటు వాహనం దొరికితే వారి ఊరు శివాలి నుండి  12 కిలోమీటర్ల దూరం లో ఉన్న రాణిఖేత్ హాస్పటల్ కి వెళ్లొచ్చు.

అసలు వాళ్ళు ఆమెను ఒక డోలి లో తీసుకుని వెళ్లదామనుకున్నారు. కడుపుతో ఉన్న ఠాకూర్ కులపు ఆడవాళ్లను పల్లకి లో కూర్చోబెట్టి పల్లకి కి ఉన్న నాలుగు మూలలను నలుగురు మనుషులు ఎత్తుకుని మోసుకుంటూ తీసుకెళ్తారు. ఈ డోలి ఆమెని రోడ్డు  వరకు తీసుకెళ్తుంది. మామూలుగా అయితే మెయిన్ రోడ్డు మీద ఏదొక వాహనం ముందే వారికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఆ ఉదయం అక్కడ డోలి లేకపోయింది, కాబట్టి వాళ్ళు నడవడం మొదలుపెట్టారు.

రానో సగం దూరం వరకు నడిచింది. “నేను సగం దూరం వచ్చాక ఇక నేను నడవలేకపోయాను(నొప్పి వలన). ఇక అప్పుడు నడవడం మానేసి ఆ దారిలోనే కూర్చుండి  పోయాను. నేను అలా కూర్చోగానే నా భర్తకు విషయం అర్ధమయి దగ్గరలో ఉన్న ఇంటికి సాయం కోసం పరిగెత్తాడు. వాళ్ళు తెలిసినవాళ్ళే. ఆ ఇంట్లో ఉంటున్న పిన్ని ఇంకో పది నిమిషాల్లో నీళ్లు, ఒక బెడ్ షీట్ పట్టుకుని వచ్చింది. మా అత్తగారు, పిన్ని నా కాన్పుకు సాయం చేశారు.” (రానో భర్త రేషన్ షాప్ లో సహాయకుడి గా పని చేసి నెలకు 8000 రూపాయలు సంపాదిస్తాడు. ఆ ఆదాయం ఒక్కటే ఆ ఇంట్లో ముగ్గురు పెద్దవాళ్ళకి, ఒక చిన్న బాబు కి ఆధారం.)

“నా కొడుకు(జగత్) ఈ అడవిలో నేను మెయిన్ రోడ్డు వరకు నడుస్తుండగానే పుట్టాడు.” అన్నది రానో, ఆ పొద్దున్న తన తోలి కానుపు ఆ దట్టమైన చెట్ల మధ్య సన్నని దారిలో ఎలా జరిగిందో తలచుకుని భయపడుతూ. “నేను ఎప్పుడూ ఇలాంటి కానుపుని ఊహించుకోలేదు. ఇప్పటికి తలుచుకుంటే ఒంట్లోంచి వణుకు వస్తుంది. దేవుడి దయ వల్ల పుట్టిన పిల్లవాడు బాగున్నాడు. అదే అన్నిటి కన్నా విలువైనది.”

ఆ ఫిబ్రవరి ఉదయాన రానో, జగత్ పుట్టిన కాసేపటికే, తన అత్తగారు 58 ఏళ్ళ  ప్రతిమ సింగ్ బిడ్డని ఎత్తుకోగా, ఆమెతో కలిసి ఇంటికి బయలుదేరింది.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ఫిబ్రవరి 2020 లో, అల్మోరా జిల్లా కు చెందిన రానో సింగ్ కొండ ప్రాంతం లో ఉన్న తన ఊరు శివాలి నుంచి 13 కిలోమీటర్ల దూరం లో ఉన్న హాస్పిటల్ కి వెళ్తూ దారిలోనే  ఒక బాబుకు జన్మనిచ్చింది.

కడుపుతో ఉన్నప్పుడు రానో రాణిఖేత్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా విపరీతమైన కడుపు నొప్పి రావడం వలన, అల్ట్రా సౌండ్ స్కానింగ్ కోసం వెళ్ళింది. కాన్పు అయిన మూడు రోజులకి అశ వర్కర్ రానో ఇంటికి ఆమెను చూడడానికి వచ్చింది. “ఆశా దీదీ బాబు బరువు చూడడానికి వచ్చింది.  అలానే చెయ్యవలసిన చెక్ అప్ లు అన్ని చేసి బాబు బాగున్నాడని చెప్పింది. నా బిపి ఒక వారం గా స్థిరంగా లేదు. కానీ ఇప్పుడు నేను బాగున్నాను. కొండ మీద ఉండే మాకు ఇలాంటి సవాళ్లు ఎదుర్కోవడమే అలవాటే.” అంది రానో.

68 ఇంటి గడపలు,  318 జనాభా కలిగిన శివాలి, తరిఖేత్ బ్లాక్, అల్మోరా జిల్లా, ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఉంది.   శివాలి గ్రామప్రజలు  ఇంతవరకు తమలో ఎవరికీ  హాస్పిటల్ కు వెళ్లే దారిలో కాన్పు జరగలేదని చెప్పారు. కానీ ఈ కొండ శిఖర ప్రాంతం లో నివసించే వారిలో కాన్పులు ఎక్కువగా ఇళ్లలోనే జరుగుతాయి. పైగా కనీసం 31 శాతం  ఉత్తరాఖండ్ రాష్ట్రం అంతా  కూడా ఇలానే జరుగుతాయని నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే( ఎన్ ఎఫ్ ఎచ్ ఎస్ -4, 2015-16) నివేదిక చెబుతోంది. కానీ హెల్త్ ఫెసిలిటీలలో(ముఖ్యంగా రాష్ట్రం నడిపే సంస్థలలో) కాన్పులు కూడా రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యాయి   అంతకు ముందు NFHS - 3(2005-06) లో 33 శాతం నుండి 69 శాతం వరకు జరుగుతున్నాయి. (లేదా ఉత్తరాఖండ్ లో మూడు లో రెండొంతుల కాన్పులు హెల్త్ ఫెసిలిటీల్లో జరుగుతున్నాయి).

అయినా గాని, కొండల మధ్యనున్న కుమాన్ ప్రాంతంలో, ఒక మహిళ కు ఆమె కుటుంబానికి హాస్పిటల్ కు  రావడం ఇప్పటికి ఒక సవాలుగానే ఉంది, అని రాణిఖేత్ లో ప్రాక్టీస్ చేస్తున్న గైనకాలజిస్ట్ చెప్పారు. ,  మోటార్ వాహనాలు నడిచే రోడ్డు బాగా దూరమవడమే కాక, రవాణా సౌకర్యం కూడా చాలా తక్కువ, అద్దెకు దొరికే వాహనాల ఖరీదు కూడా చాలా ఎక్కువ.

పోయిన ఏడాది మహమ్మారి వలన జరిగిన లొక్డౌన్ సమయంలో తరిఖేత్ బ్లాక్ లోని గర్భిణీ స్త్రీలకి ఇంకా ఇబ్బందులు వచ్చి పడ్డాయి. రానో వాళ్ళ ఊరి నుంచి  22 కిలోమీటర్ల  దూరం లో ఉన్న పాళీ నాదోలి అనే గ్రామం లో మనీషా సింగ్ రావత్ ఆగష్టు 2020 లో ఒక కూతురుకి జన్మనిచ్చింది. ఆ కానుపు ఒక మంత్రసాని పర్యవేక్షణ లో జరిగింది. “నేను హాస్పిటల్ కి వెళ్ళలేదు. నా కూతురు 14 ఆగష్టున ఇక్కడే పుట్టింది”, అని ఆమె పక్కగది వైపు వేలు చూపింది. ఆ గది లో మంచానికి ఒక వైపు కోళ్లు లేవు. అది వరుసగా  పేర్చిన ఇటికల పై నిలబెట్టి ఉంది. అదే గదిలో మనీషా, తన భర్త ధీరజ్ సింగ్ రావా ఉన్న ఫోటో ఒకటి  గోడ మీద వేలాడుతోంది. ’

సెప్టెంబర్ ఉదయం, పొద్దున్న 8.30  దాటింది. అంతకు కొద్దిసేపు ముందే మనీషా తన నెత్తి మీద, ఇంకో చేతిలోనూ గడ్డిమోపులని మోసుకొంటూ వచ్చింది. ఆ రెండు మోపులు ఓవైపు  పడేసి,  పక్కన ఉన్న సాంప్రదాయ కుమోని కిటికీలోంచి  తన నెల  రోజుల పిల్ల- రాణి ని పిలుస్తోంది. “చెలి! దేఖో కౌన్ ఆయా(చిన్ని, చూడు ఎవరొచ్చారో)”

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

మనీషా సింగ్ రావత్ కానుపు ఇంట్లోనే అయి ఆమెకి ఒక కూతురు పుట్టింది. ఆమె కానుపు ఒక దాయి/మంత్రసాని పర్యవేక్షణ లో సాగింది.

రాణి పుట్టిన రెండు వారాలకు మనీషా కొండ మీద తన పనికి వెళ్ళిపోయింది.  873 జనాభా ఉన్నతరిఖేత్ బ్లాక్ లో, పాళీ నాదోలి నుండి కొండ మీదకి వెళ్ళడానికి కనీసం ఒక కిలోమీటరున్నర నడవాలి, దానికి 30 నిముషాలు పడుతుంది . అంత దూరం కొండను ఎక్కి పొదలున్న ప్రదేశానికి వెళ్లి తన మూడు మేకలకు మేత కోసుకుని వస్తుంది మనీషా. ఈ ప్రాంతాలలో ఆడవాళ్లు ప్రతిరోజూ చాలా కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూనే ఉంటారు- నీళ్ల కోసం వెతుకుతూ , వంటకి కట్టెలు కోసం, పశువులకు మేత  కోసం. వీటన్నిటి కోసం ఎక్కువగా కొండ పైకే ఎక్కవలసి వస్తుంది -. కానీ మనీషాకు తన సమయాన్ని, శ్రమని కాస్త మిగుల్చుకోగల తెరిపి ఉంది. ఎందుకంటే వాళ్ళ రెండు గదుల సిమెంట్ ఇంటి బయట బోరింగ్ పంప్ ఉంది.

ఆమె చంటి పాప ఉయ్యాలలో నిద్రపోతోంది. ఆ ఉయ్యాల స్టీల్ హ్యాండిల్లు నీలం కిటికీల గుండా వచ్చే  పొద్దుటి సూర్యరశ్మికి బంగారు వన్నెలో మెరుస్తున్నాయి. “ఆశ వర్కర్, పాప కి పొద్దుటి పూట కొంచెం సూర్యుడి కాంతి తగలాలి చెప్పింది, పాపకి కొన్ని విటమిన్లు వస్తాయంట. ఏ విటమినో నాకు తెలీదు. మూడు రోజుల క్రితం ఆశ ఇక్కడికి వచ్చినప్పుడు, పాప బరువు తక్కువగా ఉంది. మళ్లి ఒక వారం తరవాత ఆశ వచ్చి కలవాలి ఇక్కడ” అని మనీషా నాతొ చెప్పింది. 41 సంవత్సరాల ఆశ వర్కర్ మమతా రావత్, “నెల రోజుల పాప  బరువు 3 కిలోలుంది, అసలైతే 4.2 కిలోలుండాలి”, అన్నది.

మరి మనీషా కి ఆసుపత్రి లో కాన్పు చేయించుకోవాలని అనిపించలేదా..? “నాకు హాస్పిటల్లో నే  కాన్పు ఐతే బావుండనిపించింది. అక్కడ ఇంకొన్ని సౌకర్యాలు ఉండేవి. కానీ నా కుటుంబం ఏం నిర్ణయించినా నాకు పర్లేదు”, అన్నది మనీషా.

మనీషా మామగారు పాన్ సింగ్ రావత్, హాస్పిటల్ ల్లో కాక ఇంటికి మంత్రసాని ని పిలిచి కానుపు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు “ నా మొదటి డెలివరీ కి చాలా డబ్బులు (15000 రూపాయిలు) ఖర్చయ్యాయి అని చెప్పారు. అప్పుడు బాబు పుట్టాడు” అన్నది మనీషా. ఆమె కొడుకు రోహన్ కు రెండేళ్లు. అతను రాణిఖేత్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో పుట్టాడు. అది పాళీ నాదోలి  నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దానికోసం ఆమెని ఒక డోలి లో మెయిన్ రోడ్డు లో మోటార్ వాహనం దొరికేవరకు తీసుకెళ్లారు. “ఆగష్టు 2020 లో కరోనా భయం కూడా చాలా ఎక్కువగా ఉంది. పాప కూడా అప్పుడే పుట్టింది. అది కూడా ఒక కారణం.  ఆ సమయంలో  హాస్పిటల్ కి పోయే హడావిడి ఎందుకనుకున్నాం.” అన్నది మనీషా.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

“మేము అల్మోరా వరకు కాన్పు కోసం వెళ్లేంత రిస్క్ తీసుకోదలచుకోలేదు”, అన్నాడు పాన్ సింగ్ రావత్(ఎడమ), మనీషా  వాళ్ళ మామగారు. వాళ్లది తొమ్మిదిమంది ఉన్న ఉమ్మడి కుటుంబం.

మనీషా తొమ్మిది మంది ఉన్న ఉమ్మడి కుటుంబంలో ఉంటుంది. అందులో తనతోపాటు తన ఇద్దరు పిల్లలు, తన భర్త,  అత్త, మామ, ఇంకా మరిది, అతని భార్య, వారి పాప  ఉంటారు. ఆమెకి 18 ఏళ్ళ వయసప్పుడు పెళ్లయింది. 9వ తరగతి వరకు చదువుకుంది. ఆమె భర్త, ధీరజ్ సింగ్ రావా 12 వ తరగతి వరకు చదువుకున్నాడు. అతను అక్కడే ఉన్న ట్రావెల్ ఏజెన్సీ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. “అతను అల్మోరా లో ఉన్న యాత్రికులను నైనిటాల్, భీంటల్, రాణిఖేత్ ఇంకా వేరే యాత్రాస్థలాలకి తీసుకు వెళ్తాడు. అతనికి నెలకి  సుమారుగా 20,000 వస్తాయి.” అన్నది మనీషా. లాక్ డౌన్ లో అసలు పని లేక పోవడంతో ఇంటిలో వారందరూ ఆమె మామగారు పాన్ సింగ్, పొదుపు చేసుకున్న డబ్బునే వాడారు.

“ఈ మహమ్మారి సమయంలో మేము అల్మోరా చేరుకోవడానికి 80 కిలోమీటర్లు ప్రయాణించి మా ప్రాణాలను పణంగా పెట్టలేము. అందుకే మేము కాన్పు ఇక్కడే ఇంట్లోనే జరిగేట్లు చూసాము.” వివరించాడు పాన్ సింగ్ రావత్.అతను రాణిఖేత్లో క్లాస్ 4 ఎంప్లొయ్ గా రిటైర్ అయ్యానని మాకు చెప్పాడు. “అంతేగాక హాస్పిటల్ కు  వెళ్ళడానికి మేము మార్కెట్ వద్ద ఒక వాహనాన్ని ముందే మాట్లాడుకోవాలి. అక్కడ వరకు చేరడానికి  2 కిలోమీటర్లు, ఆ తర్వాత మళ్లీ 80 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి.” అన్నాడు అతను.

మరి తల్లీబిడ్డలు సురక్షితంగా ఉంటారు లేదో అని భయపడలేదా?  “నేను వాళ్ళ అమ్మ(అతని భార్య) పెద్దవాళ్లం అయిపోయాము.ఆ సమయంలో కరోనా చాలా వ్యాపించింది.ఆ సమయంలో మేము హాస్పిటల్ కి వెళ్ళామంటే  చాలా ప్రమాదానికి సిద్ధపడినట్లు. పైగా మా ఇంటికి వచ్చిన మంత్రసాని ఇక్కడి మనిషే. మాకు ఎప్పటి నుంచో తెలుసు.ఆమె మా ఊర్లోనే  కాక చుట్టుపక్కల ఊర్లలో కూడా చాలా కాన్పులు చేసింది.” అన్నాడు అతను.

NFHS - 4 (2015-16) ప్రకారం సర్వేకి  ఐదేళ్ళ ముందు ఉత్తరాకాండ్ లో, 71 శాతం కానుపులు ఒక నైపుణ్యం కల హెల్త్కేర్ ప్రొవైడర్ సాయంతో జరిగాయి. ఇక్కడ  డాక్టర్లు , నర్సులు, మంత్రసానులు లేడీ హెల్త్ కేర్ విజిటర్లు- వీరందరిని హెల్త్ కేర్ ప్రొవైడర్ అంటారు. . అయితే  ఈ సర్వే ప్రకారం ఇంటి వద్ద  జరిగిన కాన్పులలో కేవలం 4.6 శాతం మాత్రమే నైపుణ్యం కల హెల్త్ కేర్ ప్రొవైడర్ వలన జరిగాయి. కానీ చాలావరకు, అంటే 23 శాతం వరకు ఇంటి వద్ద జరిగిన కాన్పులు,  మంత్రసాను(దాయి)ల సాయం వలెనే జరిగాయి.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ఎడమ: మనీషా తన భర్త క్రికెట్‌లో సాధించిన అవార్డులని గర్వంగా చూపించింది. కుడి: ఆమె రెండేళ్ళ కొడుకు ప్రైవేట్ ఆసుపత్రిలో పుట్టాడు

తారిఖెట్ బ్లాక్‌లోని పాలి నాడోలి, దోబా, సింగోలి గ్రామాలలో (మూడు గ్రామాల్లో మొత్తం 1273 జనాభాతో) పని చేస్తున్న ఏకైక ASHA వర్కర్ మమతా రావత్, మనీషా కుటుంబంతో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. "నేను గర్భం యొక్క మొదటి మూడు నెలల్లో మనీషాను ఆసుపత్రికి తీసుకు వెళ్ళాను" అని మమతా నాకు చెప్పింది., పాళీ నాదోలికి దగ్గరగా ఉన్న తారిఖెట్ పిహెచ్‌సికి ఈ ఇద్దరు మహిళలు, మమతా స్కూటీలో వెళ్లారు.

"నేను కూడా ఆమె డెలివరీ తేదీకి 10 రోజుల ముందు, అంటే ఆగస్టు మొదటి వారంలో మాట్లాడాను. తగిన జాగ్రత్తలతో ఆసుపత్రికి [పిహెచ్‌సికి ప్రసూతి వార్డ్ ఉంది] వెళ్ళమని చెప్పాను. తేదీ గడిచింది గాని ఆమె నుండి లేదా ఆమె కుటుంబం నుండి ఏమి కబురు రాకపోయేసరికి, ఏం జరిగిందో తెలుసుకుందామని ఫోన్ చేసాను. ఇంతకీ తెలిసిందేమిటంటే, మనీషా ఇంట్లో ప్రసవించింది! ఆసుపత్రిలో డెలివరీ కోసం నా ప్రయత్నాలు ఫలించలేదు,” అని మమతా ఆమె సలహా పట్టించుకోలేదని కాస్త కినుకగా చెప్పింది.

ఆ సెప్టెంబర్ ఉదయం చక్కటి సూర్యరశ్మి మనీషా ఇంట్లో పడుతున్న వేళ, ఆమె ఇంకా నిద్రలో తన కొడుకు రోహన్ ని ఉన్న మంచం మీద నుండి ఎత్తుకుని “లేచి చూడు, మీ చెల్లి ఎప్పుడో నిద్ర లేచింది. ” అని చెప్పింది.

ఆ తర్వాత మేము కానుపు మాటలను వదిలి వేరే కబుర్లు చెప్పుకున్నాము. ఆమె తన భర్త కి క్రికెట్ పై ఉన్న ప్రేమ గురించి గర్వం గా చెప్పింది. “ మా పెళ్ళైన కొత్తల్లో, ఆయన ప్రతి రోజు ప్రాక్టీస్ చేసేవాడు. కానీ నెమ్మదిగా బాధ్యతలు పెరిగాయి. మీకు ఈ అవార్డులు, షీల్డులు కనిపిస్తున్నాయి కదా. అవన్నీ అతనివే.” మెరిసే కళ్ళతో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉన్న అవార్డుని చూపిస్తూ అన్నదామె.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా,  PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్  కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై  దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను   చేస్తున్నారు.  సమాజం లో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను  అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి  అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ?  అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.

ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌరస్వేచ్ఛపై జిగ్యసా మిశ్రా నివేదికలు అందిస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.

అనువాదం: అపర్ణ తోట

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Jigyasa Mishra

Jigyasa Mishra is an independent journalist based in Chitrakoot, Uttar Pradesh.

Other stories by Jigyasa Mishra
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi