కోవిడ్ సెకండ్ వేవ్: ‘మమ్మల్ని వీధుల్లో చావమని వదిలేశారు’ – చిన్న పట్టణాల్లో బాధితుల వేదన

National

-BBC Telugu

By BBC News తెలుగు

|

ఘాజియాబాద్‌లో రోడ్డు మీద ఆక్సిజన్ తీసుకుంటున్న కోవిడ్ పేషెంట్

రాజేష్ సోని తన తండ్రిని ఆసుపత్రిలో చేర్చడానికి ఒక ఆటో రిక్షాలో మంగళవారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నారు. అంబులెన్సు దొరకక ఆయన ఆటోలోనే తన తండ్రిని ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్‌కు తిప్పాల్సి వచ్చింది. తండ్రి పరిస్థితి క్షీణిస్తుండటంతో సాయంత్రం అయిదు గంటలకు ఇక ఆసుపత్రి బెడ్ కోసం వెతకడం ఆపేయాలని అనుకున్నారు. విధి పై భారాన్ని మోపి ఇంటికి తిరిగి వచ్చేశారు.

“నేను ఆయనకు ఇంట్లోనే మందులు ఇస్తున్నాను. కానీ, ఆయన ఎన్ని రోజులు ఉంటారో చెప్పలేను. మమ్మల్ని వీధుల్లో చావమని వదిలేశారు” అని రాజేష్ అన్నారు.

కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఆయనను మోసం చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బెడ్లు లేవని చెప్పి పంపించేశాయి.

“నేను ధనవంతుడిని కాదు. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆటోకు, ఆసుపత్రులకు ఇచ్చేశాను. నేనిప్పుడు ఆక్సిజన్ సిలిండర్ తేవడానికి అప్పు చేయాలి” అని చెప్పారు.

దిల్లీలో ఇలాంటి కథలు చాలా సాధారణంగా మారిపోయాయి. కానీ, రాజస్థాన్‌లోన కోటాలో ఇలా జరిగింది. ఇలాంటి కథలే దేశంలో పలు చిన్న నగరాలు, పట్టణాల నుంచి కూడా వినిపిస్తున్నాయి.

దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాపిస్తున్న తీరును బీబీసీ పరిశీలించింది.

కోటా, రాజస్థాన్

గత వారంలో కోటాతో పాటు చుట్టు పక్కల ఉన్న జిల్లాల్లో మొత్తం 6000 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారి మొదలైనప్పటి నుంచి మొత్తం 264 మరణాలు చోటు చేసుకున్నాయి. కానీ, ఇందులో 35 శాతం ఒక్క ఏప్రిల్ లోనే చోటు చేసుకున్నాయి.

ఏప్రిల్ 07 వరకు కేసులు రెట్టింపు అవ్వడానికి 72 రోజులు పడితే ఇప్పుడు 27 రోజుల్లో రెట్టింపవుతున్నాయి.

ఆక్సిజన్ బెడ్స్ అన్నీ నిండిపోయాయి. ఏప్రిల్ 27 నాటికి జిల్లాలో ఉన్న 329 ఐసియు యూనిట్లలో 2 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రుల్లో సరిపోనన్ని కేసులు ఉన్నాయని అక్కడి సీనియర్ జర్నలిస్ట్ ఒకరు చెప్పారు. దీనిని బట్టి చూస్తే నమోదవుతున్న కేసుల కంటే ఎక్కువ కేసులే ఉన్నట్లు తెలుస్తోంది.

ఆక్సిజన్

రెమ్‌డెసివీర్‌, టోసిలిజుమాబ్ లాంటి మందులతో పాటు ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఈ జిల్లా దేశ వ్యాప్తంగా మెడికల్ ఇంజినీరింగ్ కాలేజీల ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే శిక్షణా కేంద్రాలకు నెలవు కూడా.

కానీ, ఇప్పుడు చాలా మంది విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దాంతో వీరు జాతీయ, అంతర్జాతీయ మీడియా రాడార్ లో లేరు.

కోవిడ్ సునామీని తట్టుకోవడానికి నగరంలోని ఆసుపత్రులు సిద్ధంగా లేవని సీనియర్ విలేకరి ఒకరు అన్నారు. “మరింత మంది వీధుల్లో మరణించే లోపు ఆక్సిజన్ బెడ్లను, ఐసియు బెడ్లను తక్షణమే ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది” అని ఆయన అన్నారు.

అలహాబాద్, ఉత్తర్ప్రదేశ్

అలహాబాద్‌లో ఏప్రిల్ 20 నాటికి 54,339 కేసులు నమోదయ్యాయి. కానీ, గత వారంలో మరో 11,318 కేసులు నమోదు కావడంతో ఇక్కడి కేసుల సంఖ్య 21శాతం పెరిగింది.

ఒక్క ఏప్రిల్ లోనే నగరంలో 614 మరణాలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ నగరంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాల గురించి అధికారిక సమాచారం లేదు. కానీ, బీబీసీతో మాట్లాడిన చాలా మంది వారి ఆప్తుల కోసం బెడ్ సంపాదించలేకపోయామని చెప్పారు.

ఇక్కడ నెలకొన్న పరిస్థితి గురించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కి చేసిన ఫోన్ కాల్స్ కి రాత పూర్వక ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. రాత్రీ పగలు పని చేస్తున్న స్మశాన వాటికలను చూస్తుంటే నిజానికి ఇక్కడ నమోదవుతున్న మరణాల కంటే ఎక్కువ సంఖ్యలోనే మరణాలు ఉన్నాయని చెప్పవచ్చని ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు.

రాష్ట్రంలో మందులు, బెడ్స్, ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. కానీ, వాస్తవ పరిస్థితి మరోలా ఉందని నిపుణులు చెబుతున్నారు.

సోషల్ మీడియా అంతా ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం, ఆక్సిజన్ కోసం, రెమ్‌డెసివీర్‌ లాంటి మందుల కోసం చేస్తున్న అభ్యర్ధనలతో నిండిపోతోంది.

కోల్‌కతా కోవిడ్ పేషెంట్

ఏదైనా ఆసుపత్రి ఆక్సిజన్ లేదని తప్పు డు నివేదికలు ఇస్తే అటువంటి వారి పై చర్య తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు.

ఆక్సిజన్ అందించడం చాలా కష్టంగా ఉందని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్న ఉద్యోగి బీబీసీకి చెప్పారు.

కానీ,ఆయన పై ప్రతీకారం తీర్చుకుంటారేమోననే భయంతో ఆయన ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా లేరు.

“కానీ, ఏ ఆసుపత్రి అయినా ఆక్సిజన్ లేదనే తప్పుడు నివేదికలు ఎందుకిస్తుందో నాకర్ధం కావడం లేదు. ఆ మాటలో అర్ధం లేదు” అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయనే రిపోర్టులు కూడా వస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో చాలా జిల్లాల్లో, గ్రామాల్లో కూడా ఆసుపత్రుల్లో బెడ్స్ లేవనే ఫిర్యాదులు వస్తున్నాయి.

కాన్పూర్ జిల్లాలో ఉన్న ఆశిష్ యాదవ్ తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. కానీ, ఆయనకు బెడ్ కాదు కదా వైద్య సహాయం కూడా అందలేదు.

“నేను ప్రతి చోటా అడుక్కుంటూ, బతిమాలుతూనే ఉన్నాను. కానీ, ఎవరూ సహాయం చేయలేదు. హెల్ప్ లైన్ నంబర్లు పని చేయలేదు” అని ఆయన బీబీసీ కి చెప్పారు.

కబీర్ ధామ్, ఛత్తీస్‌గఢ్

మార్చి 01 నాటికి ఛత్తీస్ గఢ్ లో కోవిడ్ కేసులు లేవు. కానీ, గత ఏడు రోజుల్లో అక్కడ 3000 కేసులు నమోదయ్యాయి.

కబీర్ ధామ్ జిల్లా ఆసుపత్రిలో 7 వెంటిలేటర్లు ఉన్నాయి. కానీ, వాటిని నిర్వహించగలిగే శిక్షణ పొందిన డాక్టర్లు లేరు.

ప్రభుత్వ డేటా ప్రకారం ఆ ఆసుపత్రిలో 49 మంది వైద్య నిపుణులు ఉండాలి. కానీ, అక్కడ కేవలం 7గురు మాత్రమే ఉన్నారు.

అక్కడ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత కూడా తీవ్రంగా ఉంది.

ఇక్కడకు తీవ్రంగా జబ్బు పడినవారెవరైనా వస్తే చికిత్స చేసే పరిస్థితిలో జిల్లా వైద్య యంత్రాంగం లేదని స్థానిక విలేకరులు చెప్పారు.

ఈ జిల్లాలో చాలా మంది చికిత్స అందక ముందే చనిపోయారు.

భాగల్‌పూర్‌ , ఔరంగాబాద్

బిహార్‌లోఉన్న భాగల్‌పూర్‌ జిల్లా కూడా కోవిడ్ సంక్షోభానికి గురయింది. ఏప్రిల్ 20 నుంచి చూసుకుంటే కేసుల సంఖ్య 26 శాతం పెరిగింది. అదే సమయంలో మరణాలు కూడా 33 శాతం పెరిగాయి.

ఈ జిల్లాలో ఉన్న జవహర్ లాల్ మెడికల్ కాలేజీలో మాత్రమే ఐసియు బెడ్లు ఉన్నాయి. అందులో ఉన్న 36 యూనిట్లు ఏప్రిల్ 28 నాటికి నిండిపోయాయి. అందులో ఉన్న 350 ఆక్సిజన్ బెడ్స్ లో 270 కి పైగా నిండిపోయి ఉన్నాయి.

ఆసుపత్రిలో ఉన్న 220 మంది డాక్టర్లలో 40 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని అందులో నలుగురు మరణించారని ఆసుపత్రిలో ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఇది హాస్పిటల్ మీద మరింత ఒత్తిడిని పెంచింది.

ఔరంగాబాద్ కూడా తీవ్రంగా సంక్షోభానికి గురయింది.

ఇక్కడ ఏప్రిల్ 05 నుంచి 5000 కేసులు నమోదయ్యాయి. అందులో 6గురు అదే సమయంలో మరణించినట్లు అధికారిక సమాచారం చెబుతోంది.

దిల్లీ

కానీ, దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లో నగరాల్లో కోవిడ్ పరీక్షలు సరిగ్గా జరగకపోవడం వల్ల కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని సీనియర్ విలేకరులు చెబుతున్నారు.

చాలా మంది కోవిడ్ పరీక్ష జరగక ముందే మరణిస్తున్నారు. అటువంటి మరణాలేవీ అధికారికంగా నమోదు కావడం లేదు.

సుమిత్ర దేవి ఔరంగాబాద్‌లో కోవిడ్ పరీక్ష చేయించుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది.

ఆమె కోవిడ్ పరీక్ష ఫలితాలు లేకపోవడంతో ఆసుపత్రులు ఆమెను చేర్చుకోలేదు. దాంతో ఆమె పరిస్థితి క్షీణించింది.

ఆమె కుటుంబం దగ్గర్లో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అక్కడ ఆమెకు పాజిటివ్ అని తేలింది. కానీ, అప్పటికే ఆమె పరిస్థితి విషమించిందని ఆసుపత్రి తెలిపింది.

ఆమెకు చికిత్స అందించడానికి ఆ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవు. అప్పుడు ఆమెను పాట్నాలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి కొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది.

ఆమెకు బెడ్ దొరికిన రెండు గంటల్లోనే మరణించారు.

నైనిటాల్, ఉత్తరాఖండ్

హిమాలయాల్లో ఉన్న ఈ పర్యటక ప్రాంతం కూడా పెరుగుతున్న కేసులతో ఇబ్బందులు పడుతోంది. ఏప్రిల్ 27 నాటికి

ఇక్కడ ఉన్న 142 ఐసియు బెడ్లలో కనీసం 131 నిండిపోయాయి. ఇక్కడ ఉన్న 770 ఆక్సిజన్ బెడ్స్ కి కేవలం 10 మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

గత వారంలో ఇక్కడ 4,000 కేసులు నమోదు కాగా 82 మరణాలు చోటు చేసుకున్నాయి.

ఇక్కడకు చుట్టు పక్కల పట్టణాలు, గ్రామాల నుంచి కూడా రోగులు వస్తూ ఉండటంతో పెరుగుతున్న కేసులకు చికిత్స అందించడం కష్టంగా మారింది.

“ఇక్కడ పరిస్థితి భయానకంగా ఉంది” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక స్థానిక డాక్టర్ చెప్పారు.

” ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను పెంచే ప్రయత్నం చేయకపోవడం వల్ల మేమీ పరిస్థితిలో ఉన్నాం.

ఈ మారుమూల హిమాలయ పర్వత ప్రాంతాల్లో చాలా మంది మరణిస్తారేమో అనే భయం పీడిస్తోంది. వీటి గురించి ఎవరికీ సమాచారం ఉండదు కూడా. ఇవి గణాంకాల్లోకి చేరవు” అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *