లక్ష కోట్లు మింగిన దొర కుటుంబం… ఈటలపై అణచివేత దుర్మార్గం… భూకబ్జా ఆరోపణలపై విజయశాంతి రియాక్షన్

Telangana

oi-Srinivas Mittapalli

|

తెలంగాణలో మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సత్వర విచారణకు ఆదేశించడం… ఏ విచారణకైనా తాను సిద్దమని మంత్రి ఈటల రాజేందర్ సవాల్ విసరడంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈటలను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని కొందరు అంటుంటే… తప్పు చేసినవాళ్లెవరైనా శిక్షార్హులే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఈటలపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.

‘లక్ష కోట్లు మింగిన ఈ దొర కుటుంబం బడుగు బలహీన వర్గాలపై చేస్తున్న అణచివేతల ప్రక్రియలో తమ్ముడు ఈటల రాజేందర్ గారిది మరో దుర్మార్గం. తెలంగాణ ప్రజలకు ఈ దొర అహంకారపు ధోరణుల నుంచి త్వరలో విముక్తి తప్పక లభించి తీరుతుంది.’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.

vijayashanti reaction over land grabbing allegations against minister etala rajender

ఈటల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. టీపీసీసీ సెక్రటరీ కౌశిక్ రెడ్డి ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈటల వంద ఎకరాలు కాదు ఏడు వందల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. ఆయన బీసీ ముసుగులో ఉన్న దొర అంటూ విమర్శించారు. మరోవైపు,కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ… తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే అన్నారు. అయితే ఒక్క ఈటలనే ఎందుకు టార్గెట్ అయ్యారని ఆయన ప్రశ్నించారు. జన్వాడలో భూకబ్జా చేశాడని మంత్రి కేటీఆర్‌పై కూడా ఆరోపణలున్నాయన్నారు.

ఇక ఈటలపై వస్తున్న ఆరోపణలు ఆయన అనుచరుల్లో తీవ్ర ఆగ్రహం రగిలించాయి. ముఖ్యంగా టీఆర్ఎస్‌కు మౌత్ పీస్ లాంటి ఛానెల్‌లో ‘ఆరోగ్య మంత్రికి కబ్జా రోగం’ అంటూ కథనాలు రావడంపై ఆయన అనుచరులు,అభిమానులు మండిపడుతున్నారు. ఆ ఛానెల్ ఎండీ,టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఫ్లెక్సీని తగలబెట్టి ఈటల అనుచరులు నిరసన తెలిపారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు.

తనపై వస్తున్న ఆరోపణలన్నీ కట్టు కథలేనని ఈటల ఖండించిన సంగతి తెలిసిందే. సీబీఐ,సిట్టింగ్ జడ్జి కమిటీ సహా ఏ ఎంక్వైరీకి అయిన తాను సిద్దమేనని ప్రకటించారు. అవసరమైతే తన జీవిత చరిత్ర మొత్తం ఎంక్వైరీ చేయండని సవాల్ విసిరారు. పదవులను తాను గౌరవిస్తానని… అయితే ఆత్మాభిమానం,ఆత్మగౌరవం కంటే అవి తనకు ఎక్కువ కాదన్నారు. అసైన్డ్ భూములు రైతులే తమకు స్వచ్చందంగా సరెండర్ చేశారని చెప్పారు. అయితే ఇప్పటికీ అవి వారి స్వాధీనంలోనే ఉన్నాయని… ఎవరి నుంచి బలవంతంగా భూములు తీసుకోలేదని చెప్పారు.

ఏమీ లేని నాడే ఈటల రాజేందర్ కొట్లాడిండని… ప్రలోభాలు ఉన్నప్పుడు కూడా పోరాటం ఆపలేదని… ఇప్పుడు కూడా చిల్లర రాజకీయాలకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పక్కా స్కెచ్ ప్రకారం.. ముందస్తు ప్రణాళికతోనే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ భూమిని కోల్పోయినా ఫర్వాలేదు కానీ ఆత్మను అమ్ముకోడు అని స్పష్టం చేశారు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *