National
oi-Chandrasekhar Rao
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. పశ్చిమ బెంగాల్‌లో చివరిదశ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్‌లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌పై నిలిచాయి.
అధికార తృణమూల్ కాంగ్రెస్-భారతీయ జనతా పార్టీ మధ్య టగ్ ఆఫ్ వార్‌గా నడిచిన ఈ ఎన్నికల్లో ఎవరు పాగా వేస్తారనేది తేలుతోంది. ఏబీపీ-సీ ఓటర్ (ABP-C voter) ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేసిన భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమౌతుందని ఏబీపీ-సీ ఓటర్ అంచనా వేసంది.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ పగ్గాలను అందుకుంటారని అభిప్రాయపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను తృణమూల్ కాంగ్రెస్ అందుకుంటుందని ఏబీపీ-సీ ఓటర్ పేర్కొంది. 292 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 147 స్థానాలు అవసరం అవుతాయి. ఈ మేజిక్ ఫిగర్‌ను తృణమూల్ కాంగ్రెస్ అందుకుంటుందని తెలిపింది.
తృణమూల్ కాంగ్రెస్ 42.1 ఓట్ల శాతంతో 151 నుంచి 164 సీట్లలో విజయఢంకా మోగిస్తుందని అంచనా వేసింది. బీజేపీ 39 శాతం ఓట్ల తేడాతో 109 నుంచి 121 స్థానాలను అందుకోగలుగుతుందని తెలిపింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 15.4 శాతం ఓట్లతో 14 నుంచి 25 అసెంబ్లీ నియోజకవర్గాలను స్వాధీనం చేసుకుంటాయని ఏబీపీ-సీ ఓటర్ సర్వే పేర్కొంది. దీన్ని బట్టి అంచనా వేస్తే.. తృణమూల్ కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమే అవుతుంది. బీజేపీ తన ఓటు శాతాన్ని, అసెంబ్లీ స్థానాల సంఖ్యను భారీగా పెంచుకున్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్ష స్థానానికే పరిమితమౌతుందని తేలుతోంది.
ఏబీపీ-సీ ఓటర్ సర్వే ఫలితాలు.. రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీకి 138 నుంచి 148 స్థానాలు వస్తాయని రిపబ్లిక్ టీవీ అంచనా వేసింది. తృణమూల్ కాంగ్రెస్‌కు 128 నుంచి 138 స్థానాలు రావొచ్చని పేర్కొంది. వామపక్ష పార్టీలు 11 నుంచి 21 స్థానాల వరకే పరిమితమౌతాయని అభిప్రాయపడింది.