National
oi-Srinivas Mittapalli
పశ్చిమ బెంగాల్‌లో గురువారం(ఏప్రిల్ 29) చివరిదైన ఎనిమిదో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6.30గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ స్థానాల్లో మొత్తం 283 మంది అభ్యర్థులు బరిలో ఉండగా… 84,77,728 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 43,55,835 మంది మహిళా ఓటర్లు,84,77,728 మంది పురుష ఓటర్లు,158 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
పోలింగ్ కోసం మొత్తం 11,860 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. గతంలో చెలరేగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా చివరి విడత పోలింగ్‌కు మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఎన్నికలు జరగనున్న బిర్భమ్ జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎక్కువగా అందరి దృష్టి నిలిచింది. రాష్ట్రంలోనే అత్యంత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకునే జిల్లాగా దీనికి ముద్రపడింది. బిర్భమ్ టీఎంసీ చీఫ్ అనుబర్త మండల్‌పై ఈసీ ఇప్పటికే నిఘా పెట్టింది. 62 గంటల పాటు కేంద్ర భద్రతా బలగాలు ఆయన కదలికలను కనిపెట్టనున్నాయి. 2016,2019 ఎన్నికల సమయంలోనూ అనుబర్త మండల్ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.
బిర్భమ్ జిల్లాలో అనుబర్త మండల్ అత్యంత బలమైన నాయకుడిగా చెబుతారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆయన సన్నిహితుడు. అనేక వివాదాలు,ఆరోపణలు,హత్య కేసులు చుట్టుముట్టినప్పటికీ మమతా బెనర్జీకి ఆయన సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన ఇప్పటివరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం గమనార్హం.
గత ట్రాక్ రికార్డును పరిశీలిస్తే… 2016లో బిర్భమ్ జిల్లాలోని 11కి 11 అసెంబ్లీ స్థానాలను టీఎంసీనే కైవసం చేసుకుంది. తాజా ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకోవాలని టీఎంసీ భావిస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 27తో మొదలైన ఎన్నికలు ఏప్రిల్ 29తో ముగియనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈసారి ఎలాగైనా బెంగాల్ గడ్డపై జెండా పాతాలని బీజేపీ భావిస్తుండగా… మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని టీఎంసీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్,వామపక్ష పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి.