National
oi-Chandrasekhar Rao
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి దేశాన్ని ముంచెత్తుతోంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. కరోనా వల్ల ఇదివరకెప్పుడూ ఈ తరహా దుస్థితిని భారత్ ఎదుర్కొనలేదు. ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ప్రాణవాయువు అందక వందలాది మంది పిట్టల్లా రాలిపోయే పరిస్థితులు అన్ని రాష్ట్రాల్లోనూ నెలకొన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 28,13,658 యాక్టివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. అన్ని లక్షల మందికి చాలినన్ని ఆసుపత్రులు, పడకలు, ఆక్సిజన్ అందుబాటులో ఉండట్లేదు.
ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను సైతం కదిలిస్తున్నాయి. అనేక దేశాలు భారత్‌కు తమవంతు సహకారాన్ని అందించడానికి ముందుకొస్తున్నాయి. సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు భారీ విరాళాన్ని అందిస్తున్నాయి. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించడం, ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా- సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ (google) తనవంతు సహకారాన్ని అందించింది. గూగుల్ ముఖ్యకార్యనిర్వహణాధికారి సుందర పిచాయ్.. భారత్‌కు 135 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన గివ్ ఇండియా (GivIndia)కు అందజేశారు.

గివ్ ఇండియా ద్వారా యూనిసెఫ్‌కు ఈ విరాళం అందుతుంది. ఆ మొత్తంతో వైద్య పరికరాలు, ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత ఉపకరణాలను కొనుగోలు చేయడానికి వినియోగించే అవకాశాలు ఉన్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా పేషెంట్లకు యూనిసెఫ్ తరఫున అత్యవసర వైద్య సహాయం అందుతుంది. ఆ చర్యలను యూనిసెఫ్ పర్యవేక్షిస్తుంది. సుందర్ పిచాయ్‌ను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని బహుళజాతి కంపెనీలు భారత్‌కు తమవంతు ఆర్థిక సహాయాన్ని అందించడానికి, విరాళాలను ప్రకటించడానికి ముందుకొస్తున్నారు.
ఇదిలావుండగా- దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,52,991 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,812 మంది మరణించారు. 2,19,272 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కు చేరింది. ఇందులో 1,43,04,382 మంది కోలుకున్నారు. 1,95,123 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 28,13,658కి చేరింది. కరోనా యాక్టివ్ కేసులు ఈ స్థాయిలో చేరుకోవడం ఇంతకుముందెప్పుడు జరగలేదు. ఇన్ని లక్షల మందికి చికిత్సను అందించడానికి ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు చాలట్లేదు.