Telangana
oi-Srinivas Mittapalli
గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి జరుగుతున్నందునా అందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. కరోనా ఒక వింత రోగమని… ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు.ర్యాపిడ్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో ఫలితం ఆలస్యమైతే… ఒకవేళ లక్షణాలు ఉన్నవారైతే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
వైరస్ బారిన పడినప్పటికీ కొందరిలో లక్షణాలు కనిపించకపోవడం వల్ల గుర్తించలేకపోతున్నారని ఈటల అన్నారు. దాంతో వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపి ప్రాణాలను బలితీసుకుంటోందన్నారు. పాజిటివ్ అని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారే ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. కరీంనగర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ట్యాంకు సామర్థ్యం 20కేఎల్ అని తెలిపారు. ఇది ఏడు రోజుల వరకు వస్తుందన్నారు.
ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచేందుకు కరీంనగర్ ఆస్పత్రిలో ఆటోమేటిక్ మెషీన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాని ద్వారా 400 టెస్టులు చేసే ఆస్కారం ఉంటుందన్నారు. అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రోజుకు 1000 టెస్టులు చేయవచ్చునని చెప్పారు. ప్రైవేట్ ల్యాబ్‌ల మీద ఆధారపడకుండా ఈ సౌకర్యం కల్పించామన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ 2,3రోజుల్లో ఆక్సిజన్ కొరత తీరుతుందన్నారు. పొరుగునే ఉన్న ఏపీలోని బళ్లారి,విశాఖల నుంచి కాకుండా 1300కి.మీ దూరంలో ఉన్న ఒడిశా నుంచి కేంద్రం తెలంగాణకు ఆక్సిజన్ కేటాయించిందన్నారు. అందుకే యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్‌ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో టెస్టు కిట్ల కొరత కూడా లేదని చెప్పారు.
కాగా,దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు శుక్రవారం(ఏప్రిల్ 23) బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్లాయి.ఈ యుద్ధ విమానాల్లోని 8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు. యుద్ధ విమానాలను ఉపయోగించడం ద్వారా మూడు రోజుల సమయం ఆదా అవడంతో పాటు, ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఇది దోహదపడుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
గత 3,4 రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుత అవసరానికి అది సరిపోవట్లేదు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు కేంద్రం రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది. ఇందులో 70 టన్నుల వరకు తెలంగాణలోనే పలు ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి అందించనున్నారు. మిగిలిన ఆక్సిజన్‌ను బళ్లారి, భిలాయ్, అంగుల్ (ఒడిశా), పెరంబుదూర్ నుంచి తీసుకోవాలని కేంద్రం సూచించింది. అయితే తెలంగాణకు సమీపంలోని బళ్లారి స్టీల్ ప్లాంట్ నుంచి కేటాయించింది కేవలం 20 టన్నులే. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కూడా దాదాపుగా అంతే కేటాయించారు. దూరంగా ఉన్న ప్లాంట్ల నుంచి ఎక్కువ ఆక్సిజన్‌ను కేటాయించడంతో తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాల సేవలు వాడుకుంటోంది.