జనం చస్తుంటే మీకేమీ పట్టదా… ‘సంక్షోభం’ తెలియట్లేదా.. అసలేం చేస్తున్నారు : కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు

ప్రజల ప్రాణాలపై కేంద్రానికి పట్టింపు లేదు…

ఢిల్లీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతకు సంబంధించి మ్యాక్స్ గ్రూప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళ,బుధవారాల్లో కోర్టు విచారణ చేపట్టింది. పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్‌ వినియోగం తాత్కాలికంగా నిలిపివేసి మెడికల్ అవసరాలకు దాన్ని మళ్లించాలని మంగళవారం(ఏప్రిల్ 20) కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం వైపు నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడంతో బుధవారం(ఏప్రిల్ 21) కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రానికి ప్రజల ప్రాణాలపై పట్టింపు లేదని వ్యాఖ్యానించింది. ఓవైపు జనం చనిపోతుంటే… మీకు పరిశ్రమలపై ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాలపై లేకుండా పోయిందని పేర్కొంది.

సంక్షోభం వైపు వెళ్తున్నాం…

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కాస్త సున్నితత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఆక్సిజన్ ఎక్కువగా వినియోగించే పెట్రోలియం,స్టీల్ పరిశ్రమల నుంచి ఆస్పత్రులకు దాన్ని మళ్లించాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల ప్రాణాల కన్నా ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువ కాదని వ్యాఖ్యానించింది. మనం ఓ సంక్షోభం వైపు వెళ్తున్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉందన్న పిటిషన్ తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడాన్ని కోర్టు తప్పు పట్టింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు… ఆశ్చర్యపోవడానికేమీ లేదని పేర్కొంది.

జీవించే హక్కును కేంద్రమే కాపాడాలి…

పరిశ్రమల నుంచి మెడికల్ అవసరాలకు ఆక్సిజన్ మళ్లింపుకు ఫైల్స్ క్లియర్ చేస్తున్నామని కేంద్రం కోర్టుతో పేర్కొంది. చేస్తే ఏది మరి… దాని ఫలితం ఎక్కడా కనిపించట్లేదంటూ కోర్టు కేంద్రంపై ఫైర్ అయింది. ఆస్పత్రులకు తగినంత ఆక్సిజన్ సప్లై చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అతని గుర్తుచేసింది. దానికోసం అప్పే అడుగుతారో.. అడుక్కుంటారో… దొంగతనమే చేస్తారో… ఆ బాధ్యతను మీరు నిర్వర్తించాల్సిందేనని చెప్పింది. ఒక్క ఢిల్లీ గురించే కాదు… దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులకు ఆక్సిజన్ సప్లై విషయంలో కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలి. ప్రజల జీవించే హక్కును కేంద్రం ఎలాగైనా సరే కాపాడాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇంకా ఎందుకు మేల్కోవట్లేదు…

‘ఇప్పటికీ ప్రభుత్వం ఎందుకు మేల్కొవట్లేదో మాకు అర్థం కావట్లేదు.. ఇది చాలా షాకింగ్‌గా అనిపిస్తోంది… అసలేం జరుగుతోంది… దయచేసి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోండి… వేలాది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి… ప్రజలు చనిపోతుంటే చూడాలనుకుంటున్నారా… మీరు ఇలాగే కాలాయాపన చేయండి… జనం చస్తారు…’ అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. సకాలంలో ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం కోర్టుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *