National
oi-Srinivas Mittapalli
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మే 1 నుంచి 18 ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరో 48గంటల్లో కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ఎస్ శర్మ గురువారం(ఏప్రిల్ 22) ఒక ప్రకటన చేశారు.
వ్యాక్సినేషన్‌లో కోవాగ్జిన్,కోవీషీల్డ్‌తో పాటు రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను కూడా కొన్ని హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వీలైనన్ని ఎక్కువ హెల్త్ కేర్ సెంటర్స్,ప్రైవేట్ ఆస్పత్రుల ద్వారా విస్తృత వ్యాక్సినేషన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్ తర్వాత ఏదైనా దుష్ప్రభావం కనిపిస్తే వైద్యుల పర్యవేక్షణలో ఉంటుందన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్‌లో.. 50శాతం నేరుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,ప్రైవేట్ కంపెనీలకు విక్రయించనున్నాయి. మిగతా 50శాతం కేంద్రానికి విక్రయిస్తారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 చొప్పున విక్రయించనున్నట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.600 చొప్పున విక్రయించనున్నట్లు తెలిపింది.
ఇప్పటికే తెలంగాణ సహా అసోం,మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు 18 ఏళ్లు నిండినవారికి ఉచిత వ్యాక్సిన్ అందజేస్తామని ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
వ్యాక్సిన్ కోసం కోవిన్ యాప్‌లో ఇలా రిజిస్టర్ చేసుకోండి…
మొదట cowin.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ అవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
మీ సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై బటన్ క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సిన్’ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఫోటో ఐడీ ప్రూఫ్,ఇతరత్రా వివరాలు నమోదు చేయాలి. మీకేమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే… ఆ వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుడి వైపున ఉన్న ‘రిజిస్టర్’ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ సెల్‌ఫోన్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక… మీ అకౌంట్ వివరాలన్నీ ఆ పేజీలో కనిపిస్తాయి. ‘షెడ్యూల్ అపాయింట్‌మెంట్’ అనే ఆప్షన్ ద్వారా మీ అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఒకే మొబైల్ నంబర్‌పై మరో ముగ్గురిని కూడా యాడ్ చేయవచ్చు. ఇందుకోసం యాడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది.
ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం అందులో మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.