Telangana
oi-Srinivas Mittapalli
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమేనని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించారు. పంజాగుట్ట సెంటర్‌లో తొలగించిన అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి పున:ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండుతో అంబర్‌పేట్‌లోని తన నివాసంలో వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసేంతవరకూ తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం గోషా మహల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న విగ్రహాన్ని తిరిగి తమకు అప్పగించాలన్నారు.
పంజాగుట్ట సర్కిల్‌లో 2019 ఏప్రిల్ 12న తాను అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించానని వీహెచ్ గుర్తుచేశారు. ఆ మరుసటిరోజే ఏప్రిల్ 13న విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి విగ్రహాన్ని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని… అప్పటినుంచి విగ్రహం అక్కడే ఉందని అన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వంలో ఏ ఒక్కరూ మాట్లాడటం లేదని అన్నారు. రాజ్యాంగ నిర్మాతకే తెలంగాణలో దిక్కు లేదని… ఆయన విగ్రహం తిరిగి ఏర్పాటు చేసేంతవరకూ ఆమరణ దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కాగా,పంజాగుట్ట సెంటర్‌లోని సెంట్రల్ షాపింగ్ మాల్ ఎదురుగా రెండేళ్ల క్రితం 9 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే విగ్రహానికి అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ అధికారులు దాన్ని తొలగించారు. అంతేకాదు,చెత్తను తరలించే లారీలో విగ్రహాన్ని పడేసి డంపింగ్ యార్డుకు తరలించారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్,ఏపీ మాజీ ఎంపీ హర్ష కుమార్,పలు దళిత బహుజన సంఘాలు పంజాగుట్ట సెంటర్‌లో నిరసనకు దిగాయి.
అంబేడ్కర్ విగ్రహ ఘటనకు సంబంధించి అప్పట్లో ఇద్దరు జీహెచ్ఎంసీ సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికీ అంబేడ్కర్ విగ్రహాన్ని గోషా మహల్ పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. అప్పటినుంచి వీహెచ్ దీనిపై ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఆ విగ్రహాన్ని రూ.5లక్షలు ఖర్చుతో తానే తయారుచేయించినట్లు గతంలో వీహెచ్ తెలిపారు.రాజ్యాంగం రాసిన మహానీయునికి ఇంత అవమానం జరుగుతుంటే.. ఏ నాయకుడు మాట్లాడకపోవడం దురదృష్టకరం అన్నారు. కూల్చిన చోటే మళ్లీ అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టాలని డిమాడ్ చేశారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీపై ఇటీవల వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో షర్మిల పార్టీ నిలబడలేదని ఆయన వ్యాఖ్యానించారు. షర్మిల రాజకీయాలు చేయాలంటే ఆంధ్రాలో చేసుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ విజయమ్మ రాయలసీమ రాజ్యం రావాలనుకుంటున్నారని, అందుకే ఏపీలో కొడుకును, తెలంగాణలో షర్మిలను తీసుకొస్తున్నారని విమర్శించారు.