బోరుబావిలో ఏనుగు పిల్ల: 15 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్: చివరికేమైంది?

National

oi-Chandrasekhar Rao

|

భువనేశ్వర్: బోరుబావుల్లో ఇప్పటిదాకా చిన్నపిల్లలు పడిన ఉదంతాలను చూశాం. బోరుబావులను మృత్యు ద్వారాలుగా భావిస్తుంటారు. అందులో పడిన చిన్నారులు ప్రాణాలతో తిరిగి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కొంతమంది మాత్రమే మృత్యుంజయులయ్యారు. బోరుబావుల నుంచి సురక్షితంగా తల్లి ఒడికి చేరుకున్నారు. అలాంటి బోరుబావిలో ఈ సారి ఓ గున్నేనుగు చిక్కుకుంది. దాన్ని రక్షించడానికి అటవీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సుదీర్ఘకాలం పాటు ఇది కొనసాగింది.

మన పొరుగునే ఉన్నఒడిశాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో విస్తరించి ఉన్న దేవ్‌లీ ఫారెస్ట్ రేంజ్‌ పరిధిలోని ఓ గిరిజన గ్రామం బిసుసోలా. ఈ గ్రామం సమీపంలోని అడవుల్లో వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. మూడు అడుగుల విస్తీర్ణం ఉన్న ఆ బోరుబావిలో 15 అడుగుల లోతున ఏనుగు పిల్ల చిక్కుకుపోయింది. దాహార్తిని తీర్చుకోవడానికి శనివారం తెల్లవారు జామున గ్రామం పొలిమేరల్లోకి వచ్చి ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు.

ఏనుగు పిల్ల ఘీంకారాలను విన్న గ్రామీణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దేవ్‌లీ ఫారెస్ట్ రేంజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. సుమారు 15 గంటలపాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. తొలుత దాన్ని బయటికి తీసుకుని రావడానికి నిచ్చెన ద్వారా దిగి బెల్టులను కట్టి బయటికి లాగాలని ప్రయత్నించారు. అది సాధ్యం కాలేదు. దానితో జేసీబీలను తెప్పించి బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వారు.

An elephant calf was rescued from a 15-feet deep well at a village in Odisha

బోరు బావి విస్తీర్ణం పెద్దగా ఉండటం, గున్నేనుగు చిక్కుకున్నది 15 అడుగుల లోతులోనే కావడం వల్ల దాన్ని కాపాడటం సులువైంది. బోరుబావి విస్తీర్ణం పెద్దగా ఉండటం వల్ల ఆక్సిజన్ అందడంలో అంతరాయం ఏర్పడలేదని, అయినప్పటికీ అటవీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 15 గంటల పాటు శ్రమించిన అనంతరం ఆ ఏనుగు పిల్లను ప్రాణాలతో బయటికి తీసుకుని రాగలిగారు. మూడు అడుగుల విస్తీర్ణంలో అది చిక్కుకునిపోవడం వల్ల గాయాలయ్యాయి. బయటికి వచ్చిన వెంటనే అది అడవుల్లోకి పరుగెత్తింది.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *