
ఏపీలో ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలు
ఏపీలో ఈ ఆర్దిక సంవత్సరం నంచి ఆస్తిపన్నును భారీగా పెంచాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. గతంలో వసూలు చేస్తున్న అద్దె విలువ ఆధారిత పన్ను కాకుండా రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో పన్ను భారం 20 నుంచి 30 శాతం తప్పదని అంతా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే సమయంలో ప్రభుత్వానికి వరుసగా స్ధానిక సంస్దల ఎన్నికల రూపంలో ఇబ్బంది ఎదురైంది. ఎన్నికల వేళ పన్నులు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు. అందుకే ఈ పన్నుల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసేసింది.

ఆస్తిపన్ను చెల్లింపుపై బంపర్ ఆపర్
ఏపీలో ఆస్తిపన్ను పెంపును తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరం మొదలై పది రోజులు గడుస్తున్నా పాత పన్నునే వసూలు చేస్తోంది. దీంతో ఈ పది రోజుల్లో పన్ను వసూళ్లు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఈ ఆర్ధిక సంవత్సరం చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని చెల్లిస్తే ఐదుశాతం రాయితీ ఇస్తామని కూడా ప్రకటించింది. దీంతో పాత పన్నునే మందస్తుగా చెల్లించడం ద్వారా ప్రజలకు రెండు ఆఫర్లు దక్కినట్లయింది. ఐదుశాతం రాయితీతో పాటు కొత్త పన్ను భారం కూడా తప్పింది. అయితే ఇది ఎప్పటివరకూ అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

ప్రస్తుతానికి పాత పన్నులే
ఏపీలో ప్రస్తుతానికి పాత పన్నులే వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు పురపాలకశాఖ మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. గతంలో అద్దె విలువ ఆధారిత పన్ను స్ధానంలో అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్నును ప్రస్తుతానికి వసూలు చేయొద్దని సూచించింది. తద్వారా పాత పన్నునే వసూలు చేయాలని చెప్పినట్లయింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్ధానిక సంస్దల్లో పాత పన్నునే వసూలు చేస్తున్నారు. పన్ను పెరగకపోవడంతో జనం కూడా పాత పన్నునే చెల్లిస్తున్నారు.

ఎన్నికల తర్వాత పన్ను బాదుడు ?
ప్రస్తుతం ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి. హైకోర్టు ఆదేశాలను బట్టి కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఆ తర్వాత గతంలో మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే నెలలో మిగిలిన మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. మే చివరి లోగా అన్ని స్దానిక సంస్దల ఎన్నికలు పూర్తి చేసేందుకు కమిషన్ సన్నద్దమవుతోంది. అంటే మే చివరి వరకూ ఎన్నికలు తప్పవు. ఆ తర్వాత జూన్‌లో ఆస్తిపన్ను పెంపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుంది. అప్పుడు కొత్తగా పెంచిన పన్ను అమల్లోకి రానుంది. ఆ లోపు పన్ను చెల్లించిన వారికి మాత్రం పాత పన్ను చెల్లిస్తే సరిపోతుంది.