Andhra Pradesh
oi-Srinivas Mittapalli
కోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో షెడ్యూల్ ప్రకారం ఇవాళ(ఏప్రిల్ 8) ఏపీలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఎన్నికలపై స్టే ఇచ్చినప్పటికీ.. ఎన్నికల అధికారులు ఎక్కడా ఏర్పాట్లు ఆపలేదు. దీంతో అనుకున్న సమయానికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షెడ్యూల్ ప్రకారం పోలింగ్ జరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 515 జడ్పీటీసీ స్థానాలకు 126 జడ్పీటీసీలు, 7220 ఎంపీటీసీ స్థానాలకు గాను 2371 ఎంపీటీసీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మిగతా స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఈ స్థానాల్లో మొత్తం 20వేల మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓటింగ్ కోసం మొత్తం 27వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో లక్షా 71వేల మంది సిబ్బంది పనిచేయనున్నారు.

ఈ ఎన్నికలు అక్రమం అని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. బీజేపీ,జనసేన పార్టీలు ఎన్నికల నోటిఫికేషన్‌ను వ్యతిరేకించినప్పటికీ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి.
కాగా,రాష్ట్రంలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 1న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది పరిషత్ ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే నిలిచిపోయిందో… అక్కడినుంచే తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 8న పోలింగ్,అవసరమైన చోట 9వ తేదీన రీ-పోలింగ్, 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతామని వెల్లడించారు. అయితే తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో 10న ఫలితాల వెల్లడికి అవకాశం లేకుండా పోయింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలింగ్‌కి నాలుగు వారాల ముందు కోడ్ విధించలేదన్న కారణంతో హైకోర్టు సింగిల్ బెంచ్ పరిషత్ ఎన్నికల నిర్వహణపై స్టే విధించిన సంగతి తెలిసిందే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిటిషన్ మేరకు న్యాయస్థానం ఈ స్టే ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.కన్నబాబు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
బుధవారం(ఏప్రిల్ 7) దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. 4వారాల కోడ్ నిబంధన సుప్రీం కోర్టు ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని… దాన్ని ఈ ఎన్నికలకు వర్తింపజేయాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ కోర్టులో వాదించింది. రిట్ పిటిషన దాఖలు చేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేయట్లేదని, టీడీపీ తరఫున పిటిషన్ వేయలేదని పేర్కొంది. ఎస్ఈసీ వాదనతో ఏకీభవించిన డివిజన్ బెంచ్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. అయితే సింగిల్ జడ్జి వద్ద ఉన్న రిట్ పిటిషన్‌పై తేల్చేంతవరకూ కౌంటింగ్ ప్రక్రియ,ఫలితాల వెల్లడి చేపట్టవద్దని ఎస్ఈసీని ఆదేశించింది.