National
oi-Srinivas Mittapalli
పంజాబ్‌లో దారుణం జరిగింది. ఓ దళిత మైనర్ బాలికపై 8 మంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బాలిక బాయ్‌ఫ్రెండ్ తన స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం… పంజాబ్‌లోని ఓ నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఆ బాలిక సందీప్ అనే వ్యక్తితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. సందీప్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో అతన్ని నమ్మింది. ఇదే క్రమంలో గత మార్చి 15న సందీప్ ఆ బాలికకు ఫోన్ చేశాడు. మరుసటిరోజు కలుద్దామని చెప్పి దాబ్‌వాలి మండీ ప్రాంతానికి రావాలని కోరాడు. దీంతో ఆ బాలిక అక్కడికి వెళ్లింది.

తీరా అక్కడికి వెళ్లాక.. మనమిప్పుడు జలంధర్ వెళ్తున్నామని… అక్కడికి వెళ్లాక పెళ్లి చేసుకుందామని సందీప్ బాలికతో చెప్పాడు. సందీప్ మాటలు నమ్మి ఆమె అతనితో పాటే జలంధర్ బస్సు ఎక్కింది. అక్కడికి చేరుకున్నాక సందీప్ ఆమెను ఒక గదికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ సందీప్ స్నేహితులు రంజిత్,వెర్తు,బడ్గే,రాహుల్,సందీప్, మరో ఇద్దరు ఉన్నారు. అంతా కలిసి బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. మూడు రోజుల పాటు బాలికను నిర్బంధించి అత్యాచారానికి పాల్పడిన నిందితులు మార్చి 20, ఉదయం 10గంటలకు బాలికను ఆమె ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు.
జరిగిన ఘటనపై ఆరోజు ఇంట్లోవాళ్లకు బాలిక ఏమీ చెప్పలేదు. ఆ మరుసటిరోజు అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుమార్తెను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కుటుంబ సభ్యులు 8 మంది నిందితులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.