National
oi-Chandrasekhar Rao
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు అతలాకుతలమౌతున్నాయి. రోజు గడిచే సరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, పోలింగ్ ప్రక్రియ కరోనా కేసుల పెరుగుదల కారణమౌతోన్నాయనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. కొత్తగా లక్షకు చేరువగా కరోనా కేసులు నమోదు కావడం దాని తీవ్రతకు అద్దం పడుతోంది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 93,249 కరోనా కేసులు నమోదయ్యాయి. 513 మంది మరణించారు. రోజువారీ కరోనా కేసుల పెరుగుదల వరుసగా మూడోరోజు కూడా కొనసాగుతోంది. రెండురోజులుగా 80 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజాగా ఆ సంక్య 90 వేల మార్క్‌ను దాటింది. ఇదే తీవ్రత మున్ముందు కొనసాగితే.. లక్షకు చేరువ కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన సుదీర్ఘ కాలం తరువాత 90 వేలను దాటాయి రోజువారీ కొత్త కేసులు.

కాగా, కొత్తగా 60,048 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కి చేరుకుంది. ఇందులో 1,16,29,289 మంది డిశ్చార్జ్ కాగా.. 1,64,623 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6,91,597కు చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 7,59,79,651 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో నమోదవుతోన్న రోజువారీ కరోనా కొత్త కేసుల్లో మహారాష్ట్ర వాటా అధికంగా ఉంటోంది. సగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి.
శనివారం నాటి బులెటిన్ ప్రకారం.. మహారాష్ట్రలో ఒక్కరోజు వ్యవధిలో 49 వేలకు పైగా కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇదే పరిస్థితి కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నెలకొని ఉంది. ఆయా రాష్ట్రాల్లో కరోనా ప్రొటోకాల్స్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. అనేక నగరాల్లో రాత్రివేళ కర్ఫ్యూ కొనసాగుతోంది. వారంతపు రోజుల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ- కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడట్లేదనేది తాజాగా లక్షకు చేరువగా నమోదైన కొత్త కేసులతో తేటతెల్లమైంది.