రెండో విడత ఎన్నికల వేళ… సువెందు అధికారి కాన్వాయ్‌పై నందిగ్రామ్‌లో రాళ్ల దాడి…

National

oi-Srinivas Mittapalli

|

పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికల వేళ బీజేపీ నేత సువెందు అధికారి కాన్వాయ్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానప్పటికీ… ఆయన కారు ముందు అద్దం ధ్వంసమైంది. గురువారం(ఏప్రిల్ 1) మధ్యాహ్నం నందిగ్రాంలోని సతెన్‌గబారి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సువెందు కాన్వాయ్‌తో పాటు మరో మీడియా వాహనంపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పవన్ నారా అనే రిపోర్టర్ నదుటికి గాయమైంది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు పశ్చిమ మిడ్నాపూర్‌లోనూ బీజేపీ అభ్యర్థి ప్రీతిష్ రంజన్ కోనార్ కాన్వాయ్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

west bengal stones pelted at suvendu adhikaris convoy in nandigram

గురువారం(ఏప్రిల్ 1) పశ్చిమ బెంగాల్‌లోని 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నందిగ్రాం నియోజకవర్గం కూడా ఒకటి. ముఖ్యమంత్రి,టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. బీజేపీ తరుపున సువెందు అధికారి పోటీ చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకూ టీఎంసీలో కీలక నేతగా ఉన్న సువెందు అధికారి… ఎన్నికలకు కొద్దిరోజుల ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మమత వర్సెస్ సువెందు పోరులో నందిగ్రాంలో ఎవరు విజయం సాధిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఈ ఎన్నికలను టీఎంసీ,బీజేపీ రెండూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా బీజేపీ కోటపై కాషాయ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. టీఎంసీ పదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని… ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ ప్రచారం చేస్తోంది. మరోవైపు బెంగాల్ గడ్డను బెంగాల్ బిడ్డనే పాలించాలన్న నినాదంతో మమతా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజలు మళ్లీ తమనే గెలిపిస్తారన్న ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బెంగాల్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *