పుదుచ్చేరిలో బీజేపీకి వైసీపీ ప్రచారం
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి భారీగా ఎమ్మెల్యేలను చీల్చడమే కాకుండా స్ధానిక పార్టీ ఎన్నార్ కాంగ్రెస్‌తో జతకట్టి పోటీ చేస్తున్న బీజేపీకి వైసీపీ మద్దతు పలుకుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా బీజేపీ నిర్వహించిన ఓ ప్రచార సభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొనడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. పుదుచ్చేరిలో బీజేపీకి వైసీపీ ప్రచారం చేయడమేంటని ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగారు.
పుదుచ్చేరికి ప్రత్యేక హోదా హామీ
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రకటించారు. ఇప్పటికే ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీకే దిక్కులేని పరిస్ధితుల్లో పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కేంద్రం చేసిన ప్రకటన తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏపీకి హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కేంద్రం.. ఇప్పుడు పుదుచ్చేరికి హోదా ఇస్తామంటుంటే బీజేపీకి మద్దతుగా వైసీపీ నేతలు ఎలా ప్రచారం చేస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది.
పుదుచ్చేరికి హోదాపై జగన్‌ను టార్గెట్ చేసిన లోకేష్
గతంలో మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి, ఆ తర్వాత తాకట్టు పెట్టిన సీఎం జగన్ ఇప్పుడు పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామంటే ఏం చేయలేని పరిస్దితుల్లో ఉన్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నించారు. ఏపీలో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమైన ప్రత్యేక హోదా పుదుచ్చేరిలో ఎలా మొదలవుతుందంటూ జగన్‌ను, బీజేపీని లోకేష్ నిలదీశారు. అంతే కాదు రాష్టంలో కమలంతో ప్రయాణం కట్టిపెట్టేసి, పుదుచ్చేరిలో బీజేపీ మిత్రుల గెలుపు కోసం వైసీపీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారంటూ లోకేష్ మండిపడ్డారు. మీ కేసుల గురించే కాదు ప్రత్యేక హోదా కోసం ఇప్పటికైనా గట్టిగా అడగండి అంటూ లోకేష్ ట్వీట్‌లో సూచించారు.
వైసీపీ చేస్తోంది ద్రోహం కాదా ?
గతంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పి ఇప్పుడు పుదుచ్చేరికి ఎలా ఇస్తోందంటూ టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు ట్వీట్లలో ప్రశ్నించారు. ఏపీకి ఇవ్వని హోదా పుదుచ్చేరికి ఇస్తామనడంపై బీజేపీ ఏం సమాధానం చెప్తుందంటూ టీడీపీ నేతలు నిలదీశారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఏపీ తరఫున పోరాడాల్సిన జగన్ పుదుచ్చేరిలో బీజేపీకి మద్దతుగా ప్రచారం కోసం వైసీపీ నేతల్ని పంపించడాన్నీ టీడీపీ తప్పుబట్టింది. మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను అడిగే ధైర్యం లేకపోగా.. పుదుచ్చేరికి హోదా ఇస్తామంటున్న బీజేపీ తరఫున ప్రచారానికి వైసీపీ నేతల్ని పంపడాన్ని ఏమనాలి అంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహులు అనేది వీరికి చాలా చిన్న పదమన్నారు.