నాగార్జున సాగర్ ఉపఎన్నిక : బీజేపీకి షాకిచ్చి టీఆర్ఎస్ బాటలో అంజయ్య యాదవ్ , టెన్షన్ లో బీజేపీ

బీజేపీ అభ్యర్థిగా రవి కుమార్ నాయక్ .. బీజేపీకి అంజయ్య యాదవ్ ఊహించని షాక్

ఇదిలా ఉంటే నేడు నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనున్న నేపథ్యంలో రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగి బిజెపి టికెట్ ఆశించిన ఓ సీనియర్ నాయకుడు బీజేపీకి షాక్ ఇవ్వనున్నట్టు అంతా భావిస్తే టీఆర్ఎస్ కు జై కొట్టి అంజయ్య యాదవ్ ఊహించని షాక్ ఇవ్వనున్నారు .

నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈరోజుతో గడువు ముగియనున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే నామినేషన్ల దాఖలుకు సమయం ఉంది. అయితే నిన్న రాత్రి బీజేపీ అభ్యర్థిగా రవి కుమార్ నాయక్ పేరును బిజెపి ఫైనల్ చేసింది. దీంతో ఆయన ఈ రోజు నామినేషన్ వేయనున్నారు.

బీజేపీ ఆశావహుల జాబితాలో కడారి అంజయ్య యాదవ్ … టీఆర్ఎస్ లో చేరేందుకు మొగ్గు

ఇప్పటివరకు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో మొత్తం 20 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, ఈరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నోముల భగత్, బీజేపీ అభ్యర్థిగా రవి కుమార్ నాయక్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ నుండి ఆశావహుల రేసులో ఉన్న కడారి అంజయ్య యాదవ్ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చెయ్యాలని మొదట భావించినా ఊహించని విధంగా టీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డాడు .

ఫలించిన టీఆర్ఎస్ నేతల దౌత్యం .. పార్టీలో చేరేందుకు బయలుదేరిన అంజయ్య యాదవ్

బీజేపీ నేతలకు నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు అంజయ్య యాదవ్ షాక్ ఇవ్వనున్నారు. టిఆర్ఎస్ పార్టీలో అంజయ్య యాదవ్ చేరికపై ఆ పార్టీ ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి, సైదిరెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్ చర్చలు జరిపారు వారి చర్చలు సఫలం కావడంతో అంజయ్య యాదవ్ టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆగమేఘాలమీద పార్టీలో చేర్చుకునేందుకు టిఆర్ఎస్ పార్టీ నేతలు అంజయ్య యాదవ్ అన్న సీఎం కేసీఆర్ వద్దకు తీసుకు వెళ్తున్నారు.

సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్న అంజయ్య యాదవ్

ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ లేనందున ఫామ్ హౌస్ కు బయలుదేరిన నాయకులు బిజెపి సీనియర్ నాయకుడు అంజయ్య యాదవ్ కు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పనున్నారు. టిక్కెట్టు రాని కారణంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న కడారి అంజయ్య యాదవ్ మొదట రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని భయపడిన బిజెపి నేతలకు ఆయన టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునే వార్త ఊహించని షాక్ అని చెప్పాలి. ఇక నేటితో నామినేషన్లకు గడువు ముగియనుండటంతో, మార్చి 31వ తేదీన నామినేషన్లు స్క్రూటినీ జరగనుంది. ఇక ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది.

అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ లో చేరితే బీజేపీకి సాగర్ ఎన్నికల్లో భారీ దెబ్బ

సాగర్ లో అత్యధిక ఓటు బ్యాంకు యాదవ కమ్యూనిటీదే .. అంజయ్య యాదవ్ టిఆర్ఎస్ పార్టీలో చేరితే యాదవ కమ్యూనిటీ ఓటు బ్యాంకు ను టిఆర్ఎస్ పార్టీ తమ ఖాతాలో వేసుకునే అవకాశముంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి విషయంలో బిజెపి నేతలు తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టి బీజేపీకి షాక్ ఇవ్వనుంది అనేది తాజా పరిణామాలతో అర్థమవుతుంది. బిజెపి నాగార్జున సాగర్ లో టిఆర్ఎస్ పార్టీకి చెమటలుపట్టించాలని భావిస్తే ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఇవ్వనున్న షాక్ తో బీజేపీ నేతలకు చెమటలు పడుతున్నాయి.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *