Hyderabad
oi-Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ కొత్త కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. కరోనా కేసులకు మరోసారి హాట్‌స్పాట్‌గా మారింది. మూడు, నాలుగు రోజుగా వందకు పైగా కేసులు గ్రేటర్ పరిధిలో నమోదవుతున్నాయి. హైదరాబాద్‌కు ఆనుకునే ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థలను ప్రభుత్వం మూసివేసింది.
బండి సంజయ్ ఆన్ ఫైర్: ఏం పీకుతావ్: రాక్షసుడు కేసీఆర్: కాలర్ పట్టుకుంటాం: ఓటమిపై స్కానింగ్
క్రమంగా లాక్‌డౌన్ విధిస్తారంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇక లాక్‌డౌన్ అనేది ఉండబోదని తేల్చి చెప్పారు. లాక్‌డౌన్ విధించాలనే ఆలోచన గానీ, ప్రతిపాదనలు గానీ లేవని స్పష్టం చేశారు. ప్రజలు కరోనా ప్రొటోకాల్‌ను మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. పాఠశాలలు, కళాశాలల మూసివేత కూడా తాత్కాలికమేనని కేసీఆర్ చెప్పారు. త్వరలోనే విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఈ దిశగా కసరత్తు చేస్తున్నామని వివరించారు.

లాక్‌డౌన్ విధించనప్పటికీ.. ప్రజలందరూ మాస్కులను తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. వేడుకలు, శుభకార్యాలు, ఊరేగింపులు, ఇతర ఫంక్షన్లలో పెద్ద సంఖ్యలో జనం గుమి కూడరాదని సూచించారు. ఊరేగింపులను తగ్గించుకోవాలని అన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించారు. తెలంగాణకు కేంద్ర నుంచి వ్యాక్సిన్లు సక్రమంగానే అందుతున్నాయని చెప్పారు. ఒక్క తెలంగాణకే కాదు.. ఏ రాష్ట్రం పట్ల కేంద్రం వ్యాక్సిన్‌ల పంపిణీలో వివక్ష చూపట్లేదని వ్యాఖ్యానించారు.
కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ పరిశ్రమలను మూసివేస్తారనే భయాందోళనలు ఉన్నాయని, అవి అక్కర్లేదని చెస్పారు. పరిశ్రమల మూసివేత కూడా అవసరం ఉండదని చెప్పారు. ఎవరూ గాబరా పడొద్దని సూచించారు. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 518 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. 204 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,05,309కి చేరుకుంది. ఇందులో డిశ్చార్జ్ అయినవారు 2,99,631 మంది ఉన్నారు. 1,683 మంది మృత్యువాత పడ్డారు. 3,995 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.