International
-BBC Telugu

సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ‘ఎవర్ గివెన్’ షిప్‌ను బయటికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
దీనికి రోజులు లేదంటే వారాలు కూడా పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ షిప్ తైవాన్‌లోని ‘ఎవర్‌గ్రీన్ మెరైన్’ అనే సంస్థకు చెందినది.
ఈ నౌక సుమారు నాలుగు ఫుట్‌బాల్ పిచ్‌లంత పొడవు ఉంది.
సూయజ్ కాలువలోని దక్షిణపు ఒడ్డువైపున ఇది ఇసుకలో కూరుకుపోయింది.
ఇది కాలువకు అడ్డంగా ఉండటంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన అనేక నౌకలు ఆగిపోయాయి.
దీంతో సరకు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
రోజుకు సుమారు 9.6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 70 వేల కోట్ల నష్టం జరుగుతోందని అంచనా వేస్తున్నారు.

ఇరుక్కుపోయిన ఈ నౌకను ఎలా బయటకు తీస్తారు?
ఇరుక్కుపోయిన ఈ షిప్‌ను బయటకు తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీన్ని దారికి తేవడానికి 9 టగ్‌లు (లాగే ఓడలు) ప్రయత్నాలు చేస్తున్నాయని ఈ నౌక ప్రయాణాన్ని మేనేజ్ చేస్తున్న ‘బెర్న్‌హార్డ్ షల్ట్ షిప్‌మేనేజ్‌మెంట్’ అనే సంస్థ వెల్లడించింది.
సుమారు 200 మీ.ల వెడల్పున్న కాలువలో 400 మీటర్ల పొడవున్న ఈ షిప్ అడ్డంగా ఇరుక్కుపోయింది.
ఓడకు ఇనుప తాళ్లు కట్టి లాగుతూ, ఇసుక మేటలను కదిలించేందుకు టగ్‌లు ప్రయత్నిస్తున్నాయి.
గురువారంకల్లా ఓడను తిరిగి దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నించామని, కానీ కుదరలేదని, మళ్లీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని బెన్‌హార్డ్ సంస్థ వెల్లడించింది.
కాలువ రెండు తీరాలను తాకుతూ షిప్ ఆగిపోవడంతో దానిని బైటికి తీసుకురావడం కష్టమవుతోందని క్యాంప్‌బెల్ యూనివర్సిటీ మారిటైమ్ హిస్టరీలో నిపుణుడు సాల్ మెర్కోగ్లియానో అన్నారు.

ఇసుక తవ్వకం
షిప్ చుట్టూ ఉన్న ఇసుకను తవ్వే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
నెదర్లాండ్‌కు చెందిన బోస్కాలిస్ అనే డ్రెడ్జింగ్ కంపెనీ ఈ ఇసుకను తొలగించే పనిని చేపట్టింది.
“ఇసుక మీద అతి భారీ బరువు మోపి ఉంది” అని బోస్కాలిస్‌కు చెందిన పీటర్ బెర్డోవ్‌స్కీ అన్నారు.
ఇసుక తవ్వకంతోపాటు టగ్‌లతో ఓడను లాగే పనిని సమన్వయంతో చేయాల్సి ఉంటుందని బెర్డోవ్‌స్కీ అన్నారు.
సూయజ్ కెనాల్‌లో ఇసుక తవ్వకాలు ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉందని మారిటైమ్ నిపుణుడు సాల్ మెర్కోగ్లియానో అన్నారు.
“పెద్దపెద్ద ఓడలు వచ్చినప్పుడు ఆ ఒత్తిడికి అడుగున ఉన్న బురద, ఇసుక ఇలా ఒడ్డున మేట వేస్తాయి” అని మెర్కోగ్లియానో పేర్కొన్నారు.
ఎవర్ గివెన్‌లాంటి పెద్ద ఓడలు ప్రయాణించేందుకు వీలుగా 2015లో సూయజ్ కెనాల్‌ను విస్తరించారు.

బరువులు తొలగించాల్సిందేనా?
2 లక్షల టన్నుల బరువున్న ఈ షిప్‌ను సరైన మార్గంలో పెట్టడానికి అందులోని కంటెయినర్లు, ఇంధనాన్ని తొలగించాల్సి ఉంటుంది.
ఇది ఈ ప్రయత్నాల్లో రెండో దశ.
ప్రస్తుతం ఎవర్ గివెన్ షిప్‌లో 20 అడుగుల పొడవైన కంటెయినర్లు 20వేల వరకు ఉన్నాయి.
అయితే ఈ ప్రయత్నాల్లో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయంటున్నారు నిపుణులు.
బరువులు తొలగించే సందర్భంలో అవి దెబ్బతినడం, ఓడ బ్యాలన్స్ తప్పడంలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
అందుకే ఇది చాలా సున్నితమైన, సుదీర్ఘ సమయం తీసుకునే కార్యక్రమం.
“నీటి మీద తేలుతూ పని చేసే పెద్ద పెద్ద క్రేన్‌లు తీసుకురావాల్సి ఉంటుంది. ఓడ బరువులో సమతుల్యత దెబ్బ తినకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. బరువులో అసమతుల్యత వల్ల ఓడ రెండు ముక్కలయ్యే ప్రమాదం కూడా ఉంది” అని మెర్కోగ్లియానో చెప్పారు.
షిప్ మీద ఉన్న కంటెయినర్లు ఎత్తులో ఉండటంతో క్రేన్‌లతో వాటిని దించడం కూడా కష్టమైన పనేనని నిపుణులు చెబుతున్నారు.
షిప్‌లో ఉన్న ఇంధనాన్ని తొలగించడం సులభమే. కానీ, దానితోనే సమస్య పరిష్కారం కాదని, ఇంకా చాలా బరువు తగ్గించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)