Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలోని అటానమస్ కాలేజీల్లో జరుగుతున్న అక్రమాలపై ఇవాళ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటానమస్ హోదాను అడ్డుపెట్టుకుని విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటే కుదరదని స్పష్టం చేసింది. ఆయా కాలేజీలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయని గుర్తుంచుకోవాలని విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. తోక జాడిస్తే కోర్టు కెళ్లినా వదిలిపెట్టబోమని ఆయన సీరియస్ వార్నింగ్ ఇఛ్చారు.
ఏపీలో ఉన్న 109 అటామనస్ కాలేజీలు వివిధ యూనివర్సిటీల పరిధిలో ఉన్నాయి. అయితే వర్శిటీలతో సంబంధం లేకుండా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకుని పరీక్షలు నిర్వహించి మూల్యాంకనం కూడా చేపడుతున్నాయి. వీటిలో పలు అక్రమాలు చోటు చేసుకోవడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దీంతో అటామనస్ కళాశాలలు కూడా ఈ ప్రక్రియ అంతా యూనివర్శిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిన్న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై అటానమస్ కాలేజీలు కోర్టుకెళ్తామని హెచ్చరికలు జారీ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. పలు కాలేజీలు అటానమస్ హోదా అడ్డుపెట్టుకుని అక్రమాలు చేసినట్లు తమకు ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వ నిర్ణయంపై అటానమస్ కాలేజీలు కోర్టుకు వెళ్లానుకుంటే వెళ్లొచ్చని, ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉందని, కేంద్రమే కాదు రాష్ట్రాలూ చట్టాలు చేయొచ్చన్నారు.
అటానమస్ కాలేజీలపై యూజీసీతో సంప్రదింపులు జరుపుతామని ఆయన తెలిపారు. తమ జోలికి ఎవరూ రావొద్దంటే కుదరదన్నారు.
అన్ని కాలేజీల్లో అకడమిక్ ఆడిట్ చేపడతామని, విద్యలో నాణ్యత పెంచాలన్న ఉద్దేశంతోనే తాజా మార్పులు తెచ్చినట్లు సురేష్ తెలిపారు. అభివృద్ది చెందిన దేశాల్లో విద్యావిధానం పరిశీలించాక ఈ మార్పులు చేశామన్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే 50 వేల అడ్మిషన్లు పెరిగాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మార్పులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయని, కానీ వాటిని అధిగమిస్తామన్నారు.
ఈ నాయకుడి గురించి తెలుసుకోండి
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి