International
oi-Chandrasekhar Rao
బీజింగ్: ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. చైనాకు చెందిన హ్యాకర్ల అకౌంట్లన్నింటినీ బంద్ చేసి పడేసింది. అధికారికంగా వినియోగించే వాటితో పాటు, ఫేక్ ఐడీలతో సృష్టించిన అకౌంట్లన్నింటినీ స్తంభింపజేసింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. తమ సంస్థ మార్గదర్శకాలు, విధానాలకు ప్రతికూలంగా ఉండటం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపింది. వాటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.
చైనాలో చాలాకాలం నుంచి వివాదాలను రేపుతూ వస్తోన్న గ్ఝిన్‌జియాంగ్ రీజియన్‌లో నివసించే ఉయ్‌ఘుర్ ముస్లింలు, ఆ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు, కొంతమంది సామాజిక కార్యకర్తలపై కోవర్ట్ ఆపరేషన్ సాగుతోందని, వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటూ వస్తోన్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్ యాజమాన్యం ఈ చర్య తీసుకుంది. ఈ కోవర్ట్ ఆపరేషన్‌లో చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించింది.

కోవర్ట్ ఆపరేషన్‌లో భాగంగా వారు వినియోగించే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం, ఫోన్‌కాల్స్ లిస్ట్, ఫొటోలు వంటి వ్యక్తగత సమాచారాన్ని చోరీ చేసిన హ్యాకర్లు వాటిని బహిర్గతం చేస్తున్నారని అనుమానించింది. అలాగే- విదేశాల్లో నివసిస్తోన్న చైనీయుల కార్యకలాపాలపైనా హ్యాకర్లు నిఘా ఉంచినట్లు ఫేస్‌బుక్ నిర్ధారించింది. అమెరికా సహా టర్కీ, కజకిస్తాన్, సిరియా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో నివసిస్తోన్న చైనీయులపైనా ఈ కోవర్ట్ ఆపరేషన్ సాగిస్తున్నట్లు ధృవీకరించింది.
ఎర్త్ ఎంపుస, ఈవిల్ ఐ లేదా పాయిజన్ కార్ప్ వంటి పేర్లతో సృష్టించిన గ్రూపుల్లో 500 మందికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసినట్లు పేర్కొంది. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. చైనాకు చెందిన హ్యాకర్ల అకౌంట్లను స్తంభింపజేసినట్లు పేస్‌బుక్ సైబర్ ఎస్పియోనెజ్ ఇన్వెస్టిగేషన్ హెడ్ మైక్ డ్విల్యాన్స్‌కీ, సెక్యూరిటీ పాలసీ హెడ్ నథానియల్ గ్లెయిచెర్ వెల్లడించారు. ఆయా అకౌంట్లను ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది వెల్లడించట్లేదు. ఫలితంగా- శాశ్వతంగా వాటిని స్తంభింపజేసే అవకాశాలు లేకపోలేదు.