రూ.100 కోట్ల కలెక్షన్ ఆరోపణలపై హోమ్ మంత్రి వీడియో: రిటైర్డ్ జడ్జితో విచారణకు ఛాన్స్

అనిల్ దేశ్‌ముఖ్ వీడియో..

అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించడానికి ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరో వైపు- తనపై వచ్చిన ఆరోపణలను అనిల్ దేశ్‌ముఖ్ తోసిపుచ్చారు. ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. తన చుట్టు ఉద్దేశపూరకంగా ఉచ్చు బిగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పరమ్‌బీర్ సింగ్ ఆరోపణలు చేసిన సమయంలో తాను ఆసుపత్రిలో ఉన్నానని స్పష్టం చేశారు.

అనిల్‌పై రూ.100 కోట్ల కలెక్షన్ ఆరోపణలు..

ప్రతినెలా 100 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను వసూలు చేసి, ఇవ్వాలంటూ అనిల్ దేశ్‌ముఖ్ తనపై ఒత్తిడి తీసుకొచ్చేవారంటూ పరమ్‌బీర్ సింగ్.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇది కాస్తా మహారాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిల్ దేశ్‌ముఖ్. ఆయన తప్పేమీ లేదంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం చెప్పారు.

బోంబే హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో

ఈ వ్యవహారం మొత్తం మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఉద్ధవ్ థాకరే నిర్ణయించినట్లు తెలుస్తోంది. బోంబే హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఓ ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని, పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల వెనుక ఉన్న అసలు విషయాలను నిగ్గు తేల్చాలని ఉద్ధవ్ థాకరే సర్కార్ కృతనిశ్చయంతో ఉన్నట్లు మహారాష్ట్ర మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఈ ప్యానెల్‌లో ఎవరెవరు ఉంటారనేది ఇంకా ఖరారు కావాల్సి ఉన్నట్లు పేర్కొంది.

ఆసుపత్రిలో ఉన్నా..

ఈ పరిణామాల మధ్య అనిల్ దేశ్‌ముఖ్ ఓ వీడియో విడుదల చేశారు. పరమ్‌బీర్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చారు. ఆయన ఆరోపణలను చేసిన కాలంలో తాను కరోనా వైరస్ పాజిటివ్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందానని చెప్పారు. ఫిబ్రవరి 3వ తేదీన తనకు కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని, అదే రోజు తాను ఆసుపత్రిలో చేరానని అన్నారు. అదే నెల 15వ తేదీన తాను డిశ్చార్జ్ అయ్యానని చెప్పారు. ఇంటికి వచ్చిన తాను మరో 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని వివరించారు.

నెల తరువాత బయటికి అడుగుపెట్టా..

డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్‌లో ఉన్న కాలంలో తాను రాత్రి వేళ ఓ పార్క్‌లో ప్రాణాయామం చేసేవాడినని అన్నారు. కిందటి నెల 28వ తేదీన తాను మొదటిసారిగా ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టానని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తాను ముఖ్యమంత్రికి అందిస్తానని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న కాలంలో శాఖాపరమైన కొన్ని వర్చువల్ సమావేశాల్లో పాల్గొన్నానని, అవేవీ రహస్యంగా నిర్వహించిన భేటీలు కావని చెప్పారు. తనను ఇరికించే ప్రయత్నం సాగుతోందని అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *