National
oi-Chandrasekhar Rao
చెన్నై: మద్రాస్ హైకోర్టు ఓ సంచలన తీర్పును వినిపించింది. జాతీయ పతాకంలో ముద్రించిన మూడురంగులతో రూపొందించిన భారతదేశ మ్యాప్, అశోక చక్రాన్ని డిజైన్ చేసిన కేక్‌ను కట్ చేయడం తప్పు కాదని తెలిపింది. ఆ చర్యలు జాతీయ పతాకాన్ని అవమాన పర్చడాన్ని నిరోధించడానకి ఉద్దేశించిన చట్టం పరిధిలోకి రావని పేర్కొంది. అలాంటి కేక్‌ను కట్ చేయడం ఈ చట్టం కింద జాతీయ పతకాన్ని అవమానపర్చినట్టు కాదని, సింబాలిజాన్ని దేశభక్తితో పోల్చలేమని స్పష్టం చేసింది.
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో తీర్చిదిద్దిన భారతదేశ మ్యాప్, మధ్యలో నేవీ బ్లూ కలర్‌లో 24 ఆకులు గల అశోక చక్రను డిజైన్ చేసిన కేక్‌ను కట్ చేయడం జాతీయ పతాకాన్ని అవమానించినట్టేనని, దీనిపై ఓ రూలింగ్ ఇవ్వాలంటూ 2013లో దాఖలైన పిటీషన్‌పై మద్రాస్ హైకోర్టు తన తీర్పు వినిపించింది. డీ సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. అలాంటి కేక్‌ను కట్ చేయడాన్ని జాతీయ పతాకానికి జరిగిన అవమానంగా భావించలేమని న్యాయమూర్తి జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ చెప్పారు.

కేక్‌ను కట్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటీషన్‌ను కొట్టేశారు. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశానికి చెందిన ప్రతి పౌరుడిలోనూ జాతీయ భావాలు, దేశం పట్ల భక్తిభావం ఉండాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసే వ్యక్తిలో మాత్రమే దేశభక్తి ఉందని అనుకోలేమని చెప్పారు. దేశ గౌరవాన్ని తన భుజాల మీద మోసే ప్రతి ఒక్క పౌరుడు, గుడ్ గవర్నెన్స్ కోసం పోరాడే వాళ్లందరూ దేశభక్తులేనని చెప్పారు.
అదే సమయంలో సింబాలిజాన్ని దేశభక్తితో ముడిపెట్టి చూడలేమని పేర్కొన్నారు. త్రివర్ణ పతకానికి సింబాలిక్‌గా చూపుతూ కేక్ కట్ చేయడాన్ని సింబాలిజంగా గుర్తించాల్సి ఉంటుందని అన్నారు. తన వరకు మానవత్వాన్నిమించిన దేశభక్తి లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మానవత్వాన్ని జయించే అవకాశాన్ని తాను ఎప్పుడూ దేశభక్తి ఇవ్వబోననీ చెప్పారు. దేశభక్తి ఒక్కటే చివరి మజిలీ కాకూడదనేది తన అభిప్రాయమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.