National
oi-Srinivas Mittapalli
దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అందుబాటులోకి వచ్చాక… స్కూల్ డ్రాపౌట్స్ సంఖ్య తగ్గిపోయిన సంగతి తెలిసిందే. పేదరికం కారణంగా ఎవరూ విద్యకు దూరం కావొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే మధ్యాహ్న భోజన పథకంలో కొన్నిచోట్ల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ఓ ప్రభుత్వ స్కూల్‌కు మిడ్ డే మీల్స్ కింద అధికారులు ఏకంగా పశువుల దాణాను సప్లై చేయడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే… పుణే మున్సిపల్ కార్పోరేషన్(పీఎంసీ) పరిధిలోని ఓ ప్రభుత్వ స్కూల్‌కు ఇటీవల మిడ్ డే మీల్ ఫుడ్ మెటీరియల్ వచ్చింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా స్కూల్ మూతపడటంతో ఫుడ్ మెటీరియల్‌ను విద్యార్థుల ఇళ్లకే సప్లై చేయాలని స్కూల్ అధికారులు నిర్ణయించారు. అయితే స్కూల్‌కు వచ్చిన ఆ ఫుడ్ మెటీరియల్‌ను చూసి వారు షాక్ తిన్నారు. పశువుల దానాను విద్యార్థుల మిడ్ డే మీల్స్ కోసం పంపించినట్లు గుర్తించారు.

విషయం స్థానిక సామాజిక కార్యకర్తలకు తెలియడంతో దీనిపై అధికారులను నిలదీశారు. మిడ్ డే మీల్స్ పేరుతో పంపించిన ఆ పశువుల దానా బ్యాగులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) అధికారులు ఆ ఫుడ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అధికారులు,స్కూల్ సిబ్బందిని ఆరా తీస్తున్నామని పుణే మేయర్ మురళీధర్ తెలిపారు.
విద్యార్థుల మిడ్ డే మీల్ పేరిట పశువుల దానాను పంపించడం దురదృష్టకరమని అన్నారు. దీనిపై విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా,పుణే మున్సిపల్ కార్పోరేషన్ దేశంలోని ధనిక మున్సిపల్ కార్పోరేషన్లలో ఒకటి. ఈ ఏడాది జనవరి 15 నాటికి రూ.3285కోట్ల రెవెన్యూని ఆర్జించింది. ఇలాంటి ధనిక మున్సిపల్ కార్పోరేషన్‌లో విద్యార్థులకు మిడ్ డే మీల్స్ పేరిట పశువుల దానాను పంపించడం వివాదాస్పదంగా మారింది.